ఇంకా పాఠశాలలకు చేరని పాఠ్యపుస్తకాలు – మళ్లీ నాసిరకం బ్యాగులే
గందరగోళంతో కూడిన నూతన విద్యావిధానం, అడుగు ముందుకుపడని నాడు–నేడు పనులు, పాఠశాలలకు ఇంకా పూర్తిస్థాయిలో చేరని పాఠ్యపుస్తకాలు, నాసిరకం బ్యాగులు, తదితర అపసవ్య పరిస్థితుల మధ్య వేసవి సెలవుల అనంతరం విద్యార్థులకు బడిబాట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలవిద్యలో నెలకొన్న సమస్యలపై పరిశీలన. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా ఇంకా పూర్తి స్థాయిలో బడులకు పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి చేరలేదు. దీంతో విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు లేకుండానే బడులకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది.
పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి బడులకు చేరలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా సకాలంలో బడులకు అందించలేకపోయారు. దీంతో పాఠశాలలకు వచ్చిన అరకొర వస్తువులతోనే ఉపాధ్యాయులు కిట్లను సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు, ఏకరూప దుస్తులు, నిఘంటువులు బడులకు చేరకపోవడంతో పంపిణీ సమయాన్నే పెంచేశారు. విద్యా కానుక వస్తువులు సరఫరా కాలేదనే లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1-10 తరగతి వరకు 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు క్షేత్రస్థాయికి 70 శాతం చేరాయి. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా 47.40 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన బూట్లు, ఏకరూప దుస్తులు 30 శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. బ్యాగ్‌లు 60 శాతం, నిఘంటువులు 50 శాతంలోపే చేరాయి. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా జూన్ చివరి వారంలో మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా మరో కోటికిపైగా జిల్లాలకు చేరాల్సి ఉంది. మండల కేంద్రాలకు వచ్చిన పుస్తకాల్లోనూ అన్ని టైటిళ్లు లేవు. దీంతో ఉన్నవాటితోనే కిట్లను సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు సైతం పాఠ్యపుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఒక్క పుస్తకాన్ని అందించలేదు. వీటికి డబ్బులు చెల్లించేందుకు ఆన్‌లైన్ విధానం తీసుకొస్తామని చెప్పిన అధికారులు వెబ్‌సైట్‌నే రూపొందించలేదు.
మళ్లీ నాసిరకం బ్యాగులే
విద్యార్థులకు పంపిణీ చేసిన విద్యాకానుక బ్యాగులు నాసిరకంగా ఉన్నాయంటూ పలువురు తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన బ్యాగుల సైజులతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థులకిచ్చిన బ్యాగులు చిన్నవిగా ఉన్నాయని, పుస్తకాలన్నీ బ్యాగులో సరిపోయేలా అవసరమైనంత స్థలం లేదని చెబుతున్నారు. బ్యాగుల ఎత్తు, వెడల్పు తగ్గాయంటున్నారు. బ్యాగ్ బరువు బాగా తక్కువ ఉందని, నాణ్యత కూడా లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత ఏడాది రెండు రంగుల బ్యాగ్‌లు ఇవ్వగా, ప్రస్తుతం ఒకే రంగులో అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కొన్ని మండలాల స్కూల్ కాంప్లెక్స్‌లకు సరఫరా అయిన బ్యాగుల నాణ్యతపై సందేహాలు రావడంతో, తనిఖీ నిమిత్తం కొన్నింటిని సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయానికి పంపారు. పాఠశాలలకు వాటిని సరఫరా చేయకుండా నిలిపి వేసిన అధికారులు, పైనుంచి మౌఖిక ఆదేశాలతో తిరిగి వాటినే పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడానికి ఇష్టపడటం లేదు.
విద్యార్థులకు బ్యాగ్‌లు అందించేందుకు టెండర్లు నిర్వహించారు. కొన్ని జిల్లాలకు టెండర్‌లో పేర్కొన్న నాణ్యతకు భిన్నంగా బ్యాగ్‌లను సరఫరా చేశారు. తనిఖీల్లో నాణ్యత లోపం బయటపడడంతో సుమారు మూడు లక్షల బ్యాగులను వెనక్కి తీసుకువెళ్లాలని గుత్తేదారుకు సూచించారు. కానీ, క్షేత్రస్థాయికి చేరిన వాటిలో ఎన్నింటిని గుత్తేదారు వెనక్కి తీసుకువెళ్లారనే దానిపై స్పష్టత లేదు. గతేడాది ఇచ్చిన బ్యాగులు చెడిపోవడంతో కొందరు విద్యార్థులు పక్కన పడేయగా.. మరికొందరు డబ్బులు పెట్టి బాగు చేయించుకున్నారు.