అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేసిన తరువాత ప్రపంచం మొత్తం మారుమోగిన పేరు “అల్ ఖైదా”. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అగ్ర రాజ్యం అమెరికా తో సహా ప్రపంచాన్ని ఈ సంస్థ గడగడ లాడించింది. ఒసామా బిన్ లాడెన్ హతమయ్యిన తరువాత అల్ ఖైదా కు నాయకత్వం వహిస్తున్న అల్ జవాహరి రెండు రోజుల క్రితం అమెరికా దాడుల్లో మరణించిన తరువాత మళ్ళీ అల్ ఖైదా పేరు వినపడుతుంది.ప్రస్తుతం అల్ ఖైదా పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తోలిచివేస్తుంది.
అల్ ఖైదా ప్రస్థానం:
1980 చివరిలో అఫ్గాన్ – పాకిస్తాన్ సరిహద్దు భూభాగాల్లో అల్ ఖైదా ఏర్పడింది.అల్ ఖైదా అంటే అరబిక్‌లో ‘పునాది’ అని అర్థం.ప్రపంచ వ్యాప్తంగా వెస్ట్రన్ దేశాల ప్రయోజనాల మీద దాడులు చేయటానికి పుట్టిన ఒక ఉగ్రవాద సంస్థ అది. ఆఫ్రికా,ఆసియా ఖండాలలో.. పశ్చిమ దేశాలకు చాలా సన్నిహితంగా ఉన్న, ‘ఇస్లామిక్ ను ఆచరించని’ దేశాల ప్రభుత్వాలను కూలదోస్తామనీ ప్రకటించింది.అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి సోవియట్ సైన్యం మీద పోరాడిన అరబ్ ఆర్మీలో మిగిలిన వారితో ఈ సంస్థ ఏర్పడింది.
కొన్ని సంవత్సరాల ముందు అల్ ఖైదా అనే పేరు ప్రపంచమంతటా ప్రతి ఇంటికీ తెలిసిన పేరు. పశ్చిమ దేశాల భద్రతకు అన్నిటికన్నా అధిక ముప్పుగా ఈ సంస్థను పరిగణించారు.ఎందుకంటే ఆ సమయంలో ఈ సంస్థ అత్యంత సాహసోపేతమైన,క్లిష్టమైన దాడులను విజయవంతంగా చేసింది. దానివల్ల మరింత మంది అనుచరులు ఈ సంస్థలో చేరారు.
1998లో కెన్యా, టాంజానియా దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల మీద అల్ ఖైదా ఒకే కాలంలో బాంబుదాడులు చేసింది.అనేక మంది ఆఫ్రికా పౌరులు మరణించారు.
2000 సంవత్సరంలో అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ కోల్ ను భారీ పేలుడు పదార్థాలు నింపిన బోట్‌తో ఢీకొట్టింది. ఆ దాడిలో 17 మంది సెయిలర్లు చనిపోయారు. వంద కోట్ల డాలర్ల యుద్ధనౌక దెబ్బతింది.
2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్ మీద ఉదయం వేళ ”ప్రపంచం శాశ్వతంగా మారిపోయే” పరిణామానికి కారణమైంది.
నెలల తరబడి రహస్యంగా ప్లాన్ చేసిన అల్ ఖైదా అనుచరులు నాలుగు అమెరికా ఎయిర్‌లైన్స్ విమానాలను హైజాక్ చేశారు. వాటిలో రెండిటిని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలకు ఢీకొట్టించారు. ఆ రెండు ఆకాశహర్మ్యాలు క్షణాల్లో కుప్పకూలాయి.
మరొక విమానాన్ని అమెరికా రక్షణ విభాగ కేంద్ర స్థానమైన పెంటగాన్ మీద కూల్చారు. ఇక నాలుగో విమానంలో హైజాకర్ల మీద ప్రయాణికులు తిరగబడి విజయం సాధించారు. అది ఓ పొలంలో కూలిపోయింది. అందులో ఉన్న వారందరూ చనిపోయారు.ఆ రోజు జరిగిన దాడుల్లో దాదాపు 3,000 మంది జనం చనిపోయారు. అది “9/11” ఘటనగా చరిత్రకెక్కింది.
అఫ్గానిస్తాన్‌లోని పర్వతాల్లో అల్ ఖైదా స్థావరాల్లో 9-11 దాడులకు కుట్ర, ప్రణాళికా రచన జరిగింది. అక్కడ అల్ ఖైదాకు ఆశ్రయం ఇచ్చింది తాలిబాన్లు. కాబట్టి అమెరికా, బ్రిటన్‌లు ఆ దేశం మీద దండెత్తాయి. తాలిబాన్లను గద్దె దించాయి. అల్ ఖైదాను ఆఫ్ఘనిస్తాన్ నుండి తరిమి వేశాయి.
కానీ తప్పించుకు తిరుగుతున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను వెదికి పట్టుకుని చంపటానికి అమెరికాకు మరో పదేళ్లు పట్టింది. 2011 మే నెలలో పాకిస్తాన్‌లో ఉన్న బిన్ లాడెన్‌ను అమెరికా హతమార్చింది.
నాయకత్వంలో మార్పు..కొత్త ప్రత్యర్థి:
బిన్ లాడెన్ మరణానంతరం..అల్ ఖైదాను తక్షణమే డాక్టర్ అల్ జవహిరి భర్తీ చేశాడు. ఈజిప్టుకు చెందిన మాజీ నేత్ర శస్త్ర వైద్యుడు అయిన జవహిరి 11 ఏళ్లు అల్ ఖైదా నాయకుడిగా కొనసాగారు.పుస్తకాలు బాగా చదివే జవహిరిని లాడెన్‌కు గురువుగా భావిస్తారు. జవహిరిని అమెరికా నిఘా సంస్థలు గుర్తించి హతమార్చాయి.అయితే బిన్ లాడెన్‌కు యువ, హింసాత్మక ఆలోచనలున్న జిహాదీవాదుల్లో ఉన్న కరిష్మా కానీ, అభిమానం కానీ జవహిరి సంపాదించలేకపోయాడు.
పశ్చిమ దేశాలు, వాటి మిత్ర దేశాల మీద దాడులు చేయాలని ఎల్లప్పుడూ పిలుపునిస్తూ అతడు విడుదల చేసే వీడియో సందేశాలు సుదీర్ఘంగా, విసుగు పుట్టించేలా ఉండేవి. అతడికి మాస్ అప్పీల్ లేదు.
అల్ ఖైదా నుంచి జిహాదీలు బయటకువెళ్లి కొత్తగా ఏర్పడిన అతి హింసాత్మక ‘ఇస్లామిక్ స్టేట్’ లేదా ‘ఐసిస్’ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ షామ్ – షామ్ అంటే ట్రేటర్ సిరియా)లో చేరటం ఎప్పుడో మొదలైంది.
కొత్త దాడులు చేయాలన్న ఆతృత గల యువ జిహాదీలు.. అల్ ఖైదా ఎక్కువగా మాటలు చెప్తుంటే.. ఐసిస్ పని చేస్తోందంటూ అల్ ఖైదా నాయకత్వాన్ని ఎగతాళి చేసేవారు.
ఆఫ్రికా:
ఒకప్పుడు అల్ ఖైదా అనేది భౌగోళికంగా చిన్నది. నాయకత్వంతో అతి సన్నిహితంగా పనిచేసేది.ఇప్పుడది అంతర్జాతీయ ఫ్రాంచైజీగా మారింది. ప్రపంచం నలుమూలలా దాని అనుచరులు ఉన్నారు. ప్రభుత్వ పాలన లేని, ఉన్నా అతి పేలవంగా ఉన్న ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు.ఉదాహరణకు సోమాలియాలో అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ అతి పెద్ద జిహాదీవాద బృందంగా కొనసాగుతోంది.అల్ ఖైదా, ఐసిస్ వంటి జిహాదీవాద బృందాలకు ఇప్పుడు ఆఫ్రికా సరికొత్త యుద్ధరంగంగా మారింది.
పశ్చిమాసియా:
అల్ ఖైదా అనేది స్వాభావికంగా పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఉగ్రవాద సంస్థగానే ఉంది. బిన్ లాడెన్ సౌదీ అరేబియన్. అల్ జవహిరి ఈజిప్టు వాసి. మిగతా సీనియర్ నాయకత్వమంతా కూడా దాదాపుగా అరబ్ ప్రాంతానికి చెందిన వారే.అల్ జవహిరి మరణంతో క్షీణిస్తున్న తన బలాన్ని పెంచుకోవటానికి అల్ ఖైదా సరికొత్త నాయకుడి సారధ్యంలో, సరికొత్త వ్యూహంతో ముందుకు రావచ్చు.
నిఘా సంస్థలు ఈ ఉగ్రవాద బృందంతో ముప్పు దాని నాయకత్వంతో పాటే చనిపోయిందని నిర్ధారణకు వచ్చినట్లయితే అది తెలివితక్కువే అవుతుంది.