ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ .. తెల్లవారకముందే తలుపులు కొట్టి పెన్షన్ (Pension) అందజేస్తారు.. ఆ 50 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తారు.. ఆ కుటుంబానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారంటూ వాలంటీర్ల గురించి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కరోనా కష్ట కాలంలో వాలంటీర్లే ప్రజలకు అండగా ఉన్నారని చెప్పుకుంటోంది. ఇంత కష్టపడి పనిచేసే వాలంటీర్లు గోదావరి వరదలప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాధితులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే.. అటు ఏజన్సీ గ్రామాల నుంచి మొదలుకొని దిగువన కోనసీమ, పశ్చిమగోదాదరి జిల్లాలను వరద అతలాకుతలం చేసింది. ఇళ్లు, పొలాలు, పశువులు ముంపుకు గురై తలదాచుకునేందుకు చోటులేక, ఎటూ వెళ్లే దారిలేక దిక్కుతోచని స్థితిలో మరి నిత్యం అందుబాటులో ఉండాల్సిన వాలంటీర్లు ఏమయ్యారు?..
ఏలూరు జిల్లాలో 8,001 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలను వరద ముంచెత్తినా.. బయట మండలాల నుంచి ఒక్క వాలంటీర్‌ను కూడా ముంపు మండలాలకు పంపలేదు. కేవలం రెవెన్యూ అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులను మాత్రమే నియమించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వందలాది గ్రామాలకు ముంపు ప్రమాదం ఏటా పొంచి ఉంటుంది. అక్కడ స్థానికంగా పనిచేస్తున్న వాలంటీర్లను వరద బాధితుల సహాయార్థం అధికారులు నియమించారు. ఈ మూడు మండలాల్లో మొత్తం 554 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వారిలో సుమారు 75 శాతానికి పైగా వాలంటీర్ల నివాసాలు ముంపుబారిన పడ్డాయి. ఓవైపు అయినవారిని, ఇంటి సామాగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించుకుంటూనే, మరోవైపు ముంపు బాధితులకు కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు అందించలేక వాలంటీర్లు అవస్థలు పడ్డారు. అయినాసరే ఇతర మండలాల్లోని ఒక్క వాలంటీర్‌ను కూడా బాధితుల సహాయార్ధం పంపలేదు. సాధారణ రోజుల్లో ఇంటింటికి రేషన్ ఇచ్చే ప్రభుత్వం.. వరదల్లో మాత్రం అధికారుల వద్దకు వచ్చిన బాధితులకు సరుకులు అందజేశారు. వరద నీటిలో పడుతూ లేస్తూ బాధితులు రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన బియ్యం, పప్పు, నూనె వంటివి మోసుకెళ్లాల్సి వచ్చింది.