రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. గార్లదిన్నె మండలంలోని దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్ర శిక్షణ , పరిరక్షణ సంస్థ (సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్), ట్రాక్టర్ నగర్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఇంజన్ టెస్టింగ్ ల్యాబ్ ను, తయారయ్యే పరికరాల గురించి, సంస్థలో అందిస్తున్న శిక్షణ వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
భారత ప్రభుత్వ నియమాల ఆధారంగా రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకున్న వారికి కార్యాలయం, సిబ్బంది ఏర్పాటు, మౌలిక వసతులు, ఉత్పత్తుల ఎగుమతులు, మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ కోసం 50 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ లబ్ధి పొందేందుకు రైతు ఉత్పత్తి సంస్థలలో 300 మందికి తక్కువ కాకుండా రైతులు చేరాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులపై ఒక బ్యాగుకు 1,200 రూపాయల సబ్సిడీని అందించడం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున రైతులు అకౌంట్లలోకి నేరుగా నగదు జమ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 11 విడతలుగా లబ్ది కల్పించడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న రైతులతో కేంద్ర సహాయ మంత్రి ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గతంలో ఎద్దులు, ఇతర వ్యవసాయ పనిముట్ల వ్యవసాయం చేసుకునే వారిని, చిన్న సన్నకారు రైతులకు సహకారం అందించాలని ఉద్దేశంతో యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్తోమత లేని రైతులు వ్యవసాయ యంత్రాలను బాడుగకు తీసుకుని వారి పనులకు ఉపయోగించుకోవాలన్నారు. పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలను అందిస్తున్నామన్నారు. రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు, టిల్లర్ లు, ఇతర పనిముట్లు, తదితర యంత్రాల ధరలు స్పష్టంగా రైతులకు తెలిసేలా స్పష్టమైన సమాచారం అందించాలని ఇటీవలే రాష్ట్రాలకు సూచించడం జరిగిందన్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా పరిశీలించాలన్నారు.
అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద గోదాములు, శీతల గోదాములు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు, గ్రీన్ హౌస్, పాలీహౌస్ లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతుల ఉత్పత్తులను రైతులే మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అధిక లాభం పొందవచ్చన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 2023 లో రాగి, జొన్న పంట ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మలేషియా, ఇండోనేషియా నుంచి 80 శాతం మేర వంట నూనెలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్న మంత్రి, పొద్దు తిరుగుడు, వేరుశనగ పంటలు పండించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
గార్లదిన్నె మండల కేంద్రంలోని హౌసింగ్ లేఔట్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మించడం జరుగుతోందన్నారు. ఇంతకుముందు బాడుగ ఇళ్లలో ఉన్నవారికి సొంతింటి కలను నెరవేర్చి వారికి శాశ్వత గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ, కుల, మతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ లేని వారికి గ్యాస్ కనెక్షన్ అందించడం, స్వచ్ఛ భారత్ మిషన్ కింద అడిగిన వారికి లేదనకుండా మరుగుదొడ్లని నిర్మించి ఇవ్వడం, జల జీవన్ మిషన్ కింద నీటి కొళాయిలను ఏర్పాటు చేయడం, ముద్ర యోజన కింద స్వయం ఉపాధి కోసం రుణాలు అందించడం, చిరువ్యాపారులకు స్వానిధి పథకం కింద 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. స్వానిధి పథకం కింద చిరువ్యాపారులకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు అందించేలా కేంద్ర క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తున్న లబ్ధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి సూచించారు.
ఎర్రగుంట ఎమ్ఐ ట్యాంక్ లో అమృత్ సరోవర్ పథకం కింద పూడికతీత పనులను ప్రారంభించిన మంత్రి
గార్లదిన్నె మండలంలోని ముకుందాపురం గ్రామం వద్దనున్న ఎర్రగుంట ఎమ్ఐ ట్యాంక్ లో అమృత్ సరోవర్ పథకం కింద చెరువులో పూడిక తీత పనులను మంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తదితర అన్ని రాష్ట్రాల్లోనూ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని, అధికారులు అందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్యం, విద్య, వ్యాపారం, గృహ నిర్మాణం తదితర రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రోగాల బారి నుంచి సామాన్య ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్డు తీసుకున్న వారికి 5 లక్షల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.