క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బంది వేధింపులు భరించలేక ఒక యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామలో జరిగింది. రైతుపేటలో ఉండే జాస్తి ప్రభాకరరావు , అరుణ దంపతులకు హరిత వర్షిణి సంతానం. చదువు కోసం, కుటుంబ అవసరాల కోసం ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షల యాభై వేలు లోన్ తీసుకున్నారు. మూడు నెలలుగా లోన్ అమౌంట్ కట్టకపోయేసరికి బ్యాక్ రికవరీ సిబ్బంది ఫోన్ లు చేసి ఒత్తిడి తెస్తున్నారు. తల్లితండ్రులు డబ్బులు కట్టలేక బాధపడడం భరించలేని వర్షిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హరిత వర్షిణి EAPCET లో 15,000 ర్యాంక్ సాధించిందని, ఆమె ఇంట్లో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు.
లేఖలో వర్షిణి ఏం రాసిందంటే..
‘అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కష్టమవుతుంది. నా కళాశాల ఫీజు, చెల్లి స్కూలు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. నేను నీకు భారం అవకూడదని ఇలా చేశా. ఐయామ్ సారీ అమ్మా, నేను నీకేమీ చేయ లేకపోతున్నా. నా గురించి ఏడవకు. చెల్లి జాగ్రత్త. డాడీ డబ్బులు పంపించలేకపోతే ఇల్లు గడవటం కష్టంగా ఉంటుంది కదమ్మా. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. ఎవరైనా అడిగితే ఎంసెట్లో ర్యాంకు రాలేదని చనిపోయిందని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త, చెల్లిని బాగా చదువుకోమని చెప్పు. స్కాలర్ షిప్ డబ్బులతో చెల్లిని చదివించు. దానికి బాగా తెలివితేటలు ఉన్నాయి. మంచి స్టేజి కి వెళుతుంది. బై అమ్మా, చెల్లీ. డాడీకి నిజం. చెప్పొద్దు. ఆయన వస్తే రికవరీ ఏజెంట్లు పట్టుకుంటారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి’ అని లేఖ రాసింది. వర్షిణి తల్లి ఫిర్యాదు మేరకు సిఆర్‌పిసి సెక్షన్ 174 (ఆత్మహత్యపై విచారణ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో నిబంధనలను ఉల్లంఘించినట్లు, కుటుంబాన్ని వేధించినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ పి కనకరావు తెలిపారు.