అప్లికేషన్ ఫీజు చెల్లించిన 834 మంది
ఫీజు చెల్లింపునకు నేడు గడువు
రాష్ట్రంలో బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో బుధవారం నాటికి 834 మంది నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించారు. కొత్త బార్ పాలసీ ప్రకారం బార్ల లైసెన్సుల జారీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహిస్తోంది. మొత్తం 130 మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మూడేళ్లపాటు 840 బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. వాటిలో 123 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో బార్ల లైసెన్సుల కోసం 1,672 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. వారిలో 1,441 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలో 1,308 మంది చలానాలు తీసుకోగా బుధవారం నాటికి 834 మంది నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించారు. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. చలానాలు తీసుకున్నప్పటికీ సాంకేతికపరమైన సందేహాలతో పలువురు వేచిచూసే ధోరణి అవలంబించారు. ఆ సందేహాలు కూడా తొలగిపోవడంతో నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లింపులు వేగం పుంజుకున్నాయి. గురువారం మరింతమంది దరఖాస్తు ఫీజు చెల్లిస్తారని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అనంతరం బిడ్లు తెరిచి ఈ నెల 30, 31 తేదీల్లో ఈ–వేలం నిర్వహించి బార్ల లైసెన్సులను ఖరారు చేస్తారు.