సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని జయించడానికి శ్వేత, ఒడిశా కు చెందిన జై గంగ లైఫ్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్లకు శ్వేతలో నాలుగు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తొలిరోజైన శ్రీమతి సదా భార్గవి పాల్గొన్నారు. శరీరం, మనసు యాంత్రికంగా మారిన నేటి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ధర్మ మార్గంలో నడిచే టీటీడీ ఉద్యోగులు తమ మార్గాన్ని మరింత మంచిగా తయారు చేసుకోవచ్చన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనసుతో పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. తెలీకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సానుకూల ఆలోచనలు, ఒత్తిడిని జయించే శక్తి ,ఆలోచన అవసరమని ఆమె వివరించారు. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ఏపనైనా విజయవంతం అవుతుందని అన్నారు. జై గంగ లైఫ్ అకాడమీ నిర్వాహకులు శ్రీ కిరణ్ జీ ఒత్తిడిని జయించే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. మనిషి అంతర్ముఖం, బాహ్య ముఖం అనే రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారని శ్రీ కిరణ్ జీ చెప్పారు. క్షమా గుణం అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చని అన్నారు. సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ మంగళ నరాయణి జీ, శ్వేత సంచాలకురాలు శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.
అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించండి : వ్యక్తిత్వ వికాస నిపుణులు
మోక్షం పొందేందుకు అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించాలని శ్రీవారి సేవకులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించారు. తిరుమలలోని సేవాసదన్ -2లో సత్సంగం కార్యక్రమంలో శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన జై గంగా లైఫ్ అకాడమీ నిర్వాహకులు శ్రీ కిరణ్ ప్రసంగిస్తూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు సేవకులు ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. ధ్యానం ద్వారా శరీరాన్ని, మనసును, ఆత్మను బలోపేతం చేసుకోవాలని, భక్తులకు మరింత ఉత్సాహంతో, భక్తితో సేవ చేయడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. జూలై 16వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.