దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పేదల రైళ్లు పట్టాలెక్కడం లేదు. కరోనా లాక్‌డౌన్ తర్వాత వందలాది రైలు సర్వీసులను పునరుద్ధరించిన రైల్వే అధికారులు.. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సమీప పట్టణాలకు నిత్యం రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 21 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూన్ 10 నుంచి క్రమంగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రిజర్వ్‌డ్ టికెట్లు ఉన్న వారినే ప్రయాణానికి అనుమతించిన రైల్వే శాఖ.. 2021 డిసెంబరులో ఆ విధానాన్ని ఎత్తివేసి బుకింగ్ కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయుస్తోంది.
ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్టేషన్లలో కరోనాకు ముందున్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజు వారీ ప్రయాణాలు పెరిగాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 రైళ్ల ద్వారా సుమారు 3.20లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. కరోనాకు ముందు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లలో కలిపి 70కిపైగా ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కానీ, ఇప్పుడు వాటి సంఖ్యను 30కి కుదించారు. సికింద్రాబాద్- మణుగూరు మధ్య నడిచే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్, కొల్లాపూర్-మణుగూరు మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్‌ను సైతం ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కాజీపేట-సికింద్రాబాద్ మధ్య రెండు ట్రిప్పులు నడిచే పుష్‌పుల్‌ను ఒక ట్రిప్పునకే పరిమితం చేశారు. ఫలక్‌నుమా- జనగామ మధ్య నడిచే లోకల్ రైలును మూలన పెట్టారు. ఇలా సుమారు 40కిపైగా ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించకుండా గాలికి వదిలేశారు.
చిన్న స్టేషన్లలోనూ ఆగే ప్యాసింజర్ రైళ్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. వీటిని పునరుద్ధరించకపోవడంతో నగరాల్లో చిన్న పాటి ఉద్యోగాలు చేసుకునే వారు ఇబ్బందులు పడుతూ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొని, రవాణా వ్యవస్థలన్నీ ఊపందుకున్నప్పటికీ సికింద్రాబాద్ జోన్ పరిధిలో 40కిపైగా ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాకపోవడంలో ఆంత్యరమేంటని ప్రయాణికుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. రైళ్లను పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.