మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 20వ తేదీ పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు,మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూవస్తున్నది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపీణి చేస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం
శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన అభరణాలు బహుకరించారు. బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు. ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజిల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికి కొనసాగుతున్నది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.
జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను జులై 20న ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్లో విడుదల చేయనుంది. వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు 750 టోకెన్ల చొప్పున కేటాయిస్తారు.
జూలై 24 నుండి శ్రీ కోదండరామ స్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 24 నుండి 26వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 23న సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.