“ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం” కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న “ఉచిత బియ్యాన్ని” రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ప్రజలకు పంపిణీ చేయకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తోందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా, నిరంతరం పనిచేస్తుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలను పేదోళ్లకు అందించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికీ వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం అందిస్తున్న నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం క్రింద గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం అందించడంలో విఫలమైన వైసిపి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల విజయవంతం చేసినందుకు సోము వీర్రాజు అభినందనలు తెలిపారు.
