ఆన్ లైన్ టిక్కెట్ విక్రయాలపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు విక్రంయించాలా? ఎగ్జిబిటర్ల కోరిక మేరకు తమకు అనుకూలంగా విక్రయాలు జరగాలా? అన్న అంశం కోర్టు ఫరిదిలో ఉంది. ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వినతి పత్రాలు వెళ్లినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే థియేటర్లు మూత పడటం ఖాయమని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే అంతకు ముందే ఇండస్ర్టీకి-నిర్మాతలకు గట్టి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 400 థియేటర్లు తాత్కాలిక మూత ( 50 రోజులు విరమణ ప్రకటించిన ) విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థియేటర్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోన్న కారణంగా థియేటర్లని తాత్కాలికంగా మూసి వేసినట్లు వెలుగులోకి వచ్చింది. వినోదం రోజురోజుకు ఇబ్బందుల్లో ఇరుక్కుంటోంది. థియేటర్లను నిర్వహిస్తున్నామన్న ఆనందం యజమానుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూడాల్సి వస్తోంది. అప్పులు చేసి వినోదాన్ని ప్రేక్షకులకు అందించడం కంటే థియేటర్ మూసుకోవడం మేలన్న భావనలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. నెల రోజులుగా థియేటర్లు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 థియేటర్లను తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో పంపిణీ వ్యవస్థకు కేంద్రంగా విజయవాడతోపాటు ఎన్టీఆర్ జిల్లాలో 30 సినిమా హాళ్లకు తాత్కాలికంగా తాళాలు వేశారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎగ్జిబిటర్లకు ఇబ్బందులు తెర తీశాయి. ఆ తర్వాత ధరల దుమారం వినోదాన్ని వెంటాడింది. తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ వివాదం రీల్ తిరుగుతోంది. దీనికి హైకోర్టు ఇచ్చిన స్టే బ్రేక్ వేసింది.
రాష్ట్రంలో మొత్తం 1200 థియేటర్ల వరకు ఉన్నాయి. వాణిజ్య కేంద్రం విజయవాడలో సుమారుగా 40 థియేటర్ల వరకు ఉంటాయి. ఇక ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో థియేటర్లన్నీ కలిపి 120 వరకు ఉంటాయి. కొద్దిరోజుల క్రితం భారీ బడ్జెట్ చిత్రాలను ప్రదర్శించారు. ప్రస్తుతం అగ్రహీరోల చిత్రాలు విడుదల ఇప్పట్లో లేదు. ఈ చిత్రాల కోసం దసరా, సంక్రాంతి వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు చిన్న చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించుకోవాల్సి వస్తోంది. లోగడ చిత్రం చిన్నదా, పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఓపెనింగ్స్ మాత్రం చెప్పుకోదగ్గ విధంగా ఉండేవి. ఇప్పుడు ఓపెనింగ్స్ అన్న పదం థియేటర్ల వద్ద కొత్తగా అనిపిస్తోంది. ప్రతి థియేటర్లో రోజుకు నాలుగు ఆటలను ప్రదర్శిస్తారు. ఒక ఆటకు కాకపోయినా మరో ఆటకు అయినా ప్రేక్షకులు నిండుగా ఉంటే ప్రదర్శన వేసే అవకాశం ఉంటుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.ప్రస్తుతం విడుదల అయిన చిత్రాల్లో ఉదయం ఆట పరిస్థితి ఎలా ఉందో రెండో ఆట పరిస్థితి అలాగే ఉంటోంది. ఒక్కో ఆటకు పది మందికి మించి ప్రేక్షకులు రావడం లేదని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లను నిర్వహించలేమని స్పష్టం చేస్తున్నారు. థియేటర్ల బయట ఎటువంటి బోర్డులు పెట్టకుండా ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు. వచ్చిన ఒకరిద్దరు ప్రేక్షకులకు సమాచారం చెప్పి తిప్పిపంపేస్తున్నారు.ఆదాయం లేకపోయినా ఖర్చులు మాత్రం తడిసి మోపుడు అవుతున్నాయి. థియేటర్ నిర్వహణకు నెలకు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఏసీ థియేటర్‌లో ఒక ఆటకు నిర్వహణ ఖర్చు రూ.5 వేల వరకు ఉంటుంది. అదే నాన్ ఏసీ థియేటర్‌కు రూ.2 వేల వరకు అవుతోంది. ప్రతి థియేటర్‌కు పారిశుధ్యం, విద్యుత్ చార్జీలు… వెరసి రూ.3 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. ఆటకు పది మంది లోపు వస్తే తాము ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఎదురు ఖర్చులు పెడతామని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తీసుకున్న అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా తాత్కాలిక విరమణ ఇచ్చిన థియేటర్లు దసరా కి తెరుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఎగ్జిబిటర్లు టిక్కెట్ విక్రయాల వెసులుబాటు కోల్పోతే మరింత అద్వానంగా మరే అవకాశం కనిపిస్తుంది. మరి దీనిపై పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.