ఆంధ్రప్రదేశ్ లో తరుచుగా జరుగుతున్న గ్యాస్ లీక్ ప్రమాదాల మీద అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.ప్రమాదాలు జరిగినప్పుడు సరైన చర్యలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం,అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
పరిశ్రమల్లో ఆ పని ఖచ్చితంగా చేపట్టాలి : పవన్ కళ్యాణ్
అచ్యుతాపురం సెజ్‌లో తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఎప్పుడు, ఏ ప్రమాదం సంభవిస్తుందోనని.. ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనని భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని దుస్తులు తయారుచేసే సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికారగణం నిర్లిప్తతే కారణమని ఆరోపించారు.
కమిటీలు వేయడం కాకుండా పని చేయాలి : చంద్రబాబు
అచ్యుతాపురం సెజ్ పరిశ్రమ ప్రమాద ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మొదలుకుని పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమైపోయిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో వరస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పారిశ్రామిక ప్రమాదాలు, కార్మికుల మరణాలు సాధారణమయ్యాయని విమర్శించారు. ప్రమాదాలపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందని, ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.