ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను తాజాగా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వరల్డ్‌లోనే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ జాబితాను విడుదల చేసినా.. హెన్లీ తాజాగా మొదటి రెండు త్రైమాసికాలకు సంబంధించిన జాబితాను అప్‌డేట్ చేసింది. టూరిస్ట్ వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను హెన్లీ ఇండెక్స్ రూపొందించింది. తాజాగా విడుదలైన జాబితాలో సింగపూర్, సౌత్ కొరియాను వెనక్కి నెట్టి జపాన్ మొదటి ర్యాంకులో నిలిచింది. జపాన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా ఏకంగా 193 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే.. మన పాస్‌పోర్టు 85వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో 83వ ర్యాంకులో ఉన్న భారత్.. రెండు స్థానాలు దిగజారింది. ఇండియన్ పాస్‌పోర్టుతో ముందస్తు వీసా లేకుండా 57 దేశాలకు వెళ్లొచ్చు. అదే 2021లో భారత పాస్‌పోర్టుతో 58 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది. ఇక జపాన్ తర్వాత అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు కలిగిన సింగపూర్, దక్షిణ కొరియా పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరం లేకుండా 192 గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. కాగా, ఈ జాబితాలో అఫ్ఘనిస్థాన్ (166) అట్టడుగు స్థానంలో నిలిచింది. అప్ఘాన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 27 దేశాలకు మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉంది. దాయాది పాకిస్థాన్ మాత్రం 109వ స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో 32 గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. ఈ మేరకు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ గ్లోబల్ సంస్థ ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్’ పేరుతో తాజాగా జాబితాను విడుదల చేసింది. దీని ఆధారంగా ఆయా దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు ఎన్ని దేశాలను సందర్శించవచ్చో తెలియజేస్తుంది.
టాప్-10 పాస్‌పోర్ట్స్ ఇవే.. 1. జపాన్ (193 గమ్యస్థానాలు) 2. సింగపూర్, సౌత్ కొరియా (192) 3. జర్మనీ, స్పెయిన్(190), 4. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ (189) 5. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ (188) 6. ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే (187), 7. బెల్జీయం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా (186), 8. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (185), 9. హంగేరీ (183) 10. పోలాండ్, లిథువేనియా, స్లోవేకియా (182)
వరెస్ట్ పాస్‌పోర్ట్స్ ఇవే.. 105. నార్త్ కొరియా(40 గమ్యస్థానాలు), 106. నేపాల్, పాలస్తీనా(38), 107. సోమాలియా(35), 108. యెమెన్(34), 109. పాకిస్థాన్(32), 110. సిరియా(30), 111. ఇరాక్(29), 112. అఫ్ఘనిస్థాన్(27) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 199 పాస్‌పోర్ట్‌లను వాటి హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా యాక్సెస్ చేయగల గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చింది. వీసా పాలసీ మార్పులు అమలులోకి వచ్చినప్పుడు ఏడాది పొడవునా ఈ జాబితాను అప్‌డేట్ చేస్తుంటారు. ప్రధానంగా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా రూపొందించబడింది. ఐఏటీఏ 2006 నుండి ప్రపంచంలోని అత్యంత ప్రయాణానికి అనుకూలమైన పాస్‌పోర్ట్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది.