మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమాభిమానాలు ఎంతో సంతృప్తినిచ్చాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా 2019 జూలై 24న బాధ్యతలు స్వీకరించిన బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. దూరదర్శన్ సప్తగిరి ఛానెల్‌లో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి హరిచందన్ చేసిన ప్రసంగం ఆదివారం ప్రసారం కానుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేయడం గౌరవంగా ఉందని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను గవర్నర్‌గా మూడు ఫలవంతమైన, సఫలీకృతమైన సంవత్సరాలను పూర్తి చేసానన్నారు. గడిచిన మూడేళ్లలో తనకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాల సభ్యులకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. హరిచందన్ తన ప్రసంగంలో విభిన్న అంశాలను ప్రస్తావించారు. ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామ రాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించగా ఆ కార్యక్రమంలో తాను భాగస్వామిని కావటం ఆనందంగా ఉందన్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి విశాఖపట్నంలో జరిగిన ఫ్లీట్ రివ్యూ 2022లో పాల్గొనటం మధురానుభూతిని ఇచ్చిందన్నారు. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించటం తనకు లభించిన మరో మంచి అవకాశమన్నారు. 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరిట నిర్వహించుకున్న 50వ వార్షికోత్సవ వేడుకలలో విజయవాడ రాజ్‌భవన్‌లో ‘విక్టరీ జ్వాల’ అందుకున్నానన్నారు. విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కరోనా కాలంలో నిరంతరం సేవలు అందించేలా వారిని సమాయత్తం చేయగలిగామన్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ మిలియన్ మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టామని గవర్నర్ హరిచందన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అనితర ప్రతిభను ప్రదర్శించి అంతర్జాతీయ వేదికలపై చాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులతో పాటు, పద్మశ్రీ పురస్కారాలు దక్కించుకున్న వారిని కూడా రాజ్ భవన్ కు ఆహ్వానించి సముచిత రీతిన గౌరవించే అవకాశం లభించటం తనకు లభించిన సదవకాశంగా భావిస్తున్నానన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాధస్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.