ఒంటరి మహిళల పెన్షన్ల విషయంలో పలు మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పెన్షన్ అర్హత వయసును భారీగా పెంచింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
50 దాటాల్సిందే….
ఇప్పటి వరకు గ్రామాల్లో 30, పట్టణాల్లో 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఇకపై కొత్తగా అప్లై చేసుకునే వారికి 50 ఏళ్లు దాటితేనే పింఛన్ ఇస్తామని స్పష్టం చేసింది. భర్తను వదిలి / భర్త వదిలేసి కనీసం సంవత్సరం గడిచిన తర్వాతే పెన్షన్‌కు అర్హత పొందుతారని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీపీఎల్ కు దిగువన ఉండాల్సిందే…
యాభై ఏళ్లు నిండి ఉండటమే కాదు కచ్చితంగా దారిద్ర్య రేఖ దిగువన ఉండాలని…స్థానికంగా నివసించాలని తాజా ఉత్తర్వుల్లో సర్కార్ తెలిపింది. ఆధార్ కార్డ్ సమర్పించాలనిపేర్కొంది. అదే సమయంలో ఏ ఇతర సామాజిక పించన్ పథకం లో భాగం అయినా పెన్షన్ వర్తించదని తెలిపింది.
ప్రభుత్వ ఉత్తర్వులు
ఒంటరి మహిళల విభాగంలో అర్హులైన వారికి ప్రస్తుతం నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం. తాజా నిర్ణయం ఫలితంగా.. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారికి వర్తింప చేస్తే పెద్ద ఎత్తున మహిళలు నష్టపోతారు. అయితే కొత్తగా మంజూరుచేస్తున్న పెన్షన్లైనా లేకపోతే .. ఇప్పటికీ ఉన్న జాబితాలో కూడా ఈ విధంగా మార్పులు చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ ఉత్తర్వులను అమలు చేసిన తర్వాత యాభైఏళ్ల లోపు ఒంటరి మహిళలకు పెన్షన్లు రాకపోతే… పాత పెన్షనర్లకు కూడా వర్తింప చేసినట్లుగా భావించాల్సి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
50 ఏళ్లు దాటితేనే ఒంటరి మహిళకు పెన్షన్
సామాజిక ఫించన్ కోతకు రంగం సిద్ధమైంది. పెన్షన్ దారుల్లో టెన్షన్ మొదలైంది. జూన్‌లో పెన్షన్ తీసుకున్న వారిలో జూలై నెలలో ఎంత మంది తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. 50 ఏళ్లు దాటిన ఒంటరి మహిళకే పెన్షన్ ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 22తో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ రకాలుగా నిరాశ్రయులైన వారికి ఊరట కలిగించేందుకు అందించే పెన్షన్‌లోనూ కత్తెర వేయడానికి ప్రభుత్వం యత్నాలు ముమ్మరం చేసింది. చిత్తూరు జిల్లాలో 31 మండలాల పరిధిలో 2,51,320 మంది 16 రకాలైన పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారిలో 10 నుంచి 20 శాతం మందికి వివిధ కారణాలతో పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనిపై లెక్కలు ఓ కొలిక్కి రానున్నాయి. తాజా జాబితా ఆధారంగానే జూలై నెల పెన్షన్ అందనుంది.
జిల్లాలో 6,095 మంది ఒంటరి మహిళలకు పెన్షన్ అందేనా ?
ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు వయస్సు దాటిన అవివాహితులైన, భర్త వదిలేసిన, ఎలాంటి ఆధారమూ లేక ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ అందించేవారు. ఈ లెక్కన జిల్లాలో 6,095 మంది ఒంటరి మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. నెలకు రూ.1.52 లక్షల నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన తాజా జీవోలో 50 ఏళ్లు దాటిన ఒంటరి మహిళకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనే నిబంధన పెట్టడంతో జూలై నెలలో పెన్షన్ రావడం ప్రశ్నార్థకంగా మారింది.. ఇతర మండల అధికారులతో పరిశీలనపెన్షన్ లబ్ధిదారుల పునఃపరిశీలన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. గతంలో ఆయా మండలాల ఎంపీడీవోలు, అధికారులు పరిశీలన చేసేవారు. తాజాగా ఇతర మండలాల ఎంపీడీవోలతో పరిశీలన ప్రక్రియ మొదలు పెట్టారు. తద్వారా అత్యధిక శాతం మంది పెన్షన్ కొల్పోయే ప్రమాదం ఉంది.
పెండింగ్‌లో 12 వేల పెన్షన్ దరఖాస్తులు ?
వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా జిల్లా స్థాయి, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, మండల స్థాయిలో గత ఆరు నెలల్లో పెన్షన్ కోసం దాదాపు 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీరిలో ఎంతమంది అర్హులు అనే అంశంపై అధికారులు పరిశీలించనున్నారు.