తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. విభజన హామీలు, పెండింగ్ సమస్యల పరిష్కారంలో అధికార వైసీపీ కేంద్రాన్ని ఒప్పించటంలో విఫలమైందన్న విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కేశినేని, గల్లా, రామ్మోహన్ నాయుడు, కనమేడల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తూ వక్రభాష్యం చెబుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. టీడీపీ నిర్ణయాన్ని వైసీపీ ఎద్దేవా చేయడమంటే ద్రౌపది ముర్మును అవమానించడమేనని చెప్పారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం గళమెత్తుతామన్నారు.సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్ముకు ఓటేస్తామన్నారు. ద్రౌపది ముర్ముకు మద్దతివ్వడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు. కేంద్రం వివిధ హెడ్స్ ద్వారా ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్నారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీల నుంచి వైసీపీ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని.. దీనిపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ నిధులనూ ఏపీ ప్రభుత్వం. దారి మళ్లించిందన్నారు. జగన్ కంపెనీలు.. జగన్ బినామీ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్నాయి.. ఏపీ మాత్రం దివాళ తీస్తోందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
