ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం కూడా వివాదంలోకి లాగబడింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. ఆమె డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అయితే డిప్రెషన్ ఎందుకు వచ్చిందో చెప్పటం లేదు. దొరికిందే ఛాన్స్ అన్నట్లు వైసీపీ సోషల్ మీడియా అధినేత దేవేంద్ర రెడ్డి తన పాచిక విసిరారు. ముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. పిన్నిని ఎవరు చంపారో అంటూ. పిన్ని అన్నారంటే అది లోకేష్ టార్గెట్ గానే అని అర్ధమైపోయింది. అర్ధం అయ్యే లోపు దేవేంద్ర రెడ్డి డైరెక్టుగా లోకేష్ పై ఆరోపణలు చేస్తూ మరో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఏవో సర్వే నెంబర్లు చూపిస్తూ.. ఆ ఆస్తి కోసమే లోకేష్ బెదిరించారని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ ప్రచారం మొదలెట్టారు. ఒక అబద్ధాన్ని నిజంగా భ్రమించేలా ఎలా చేయొచ్చో.. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే బాగా నేర్పించేశాడు. అదే ఫార్ములాను దేవేంద్ర రెడ్డి బాగా అమలు చేశారని చెప్పుకుంటున్నారు. పైగా వైఎస్ వివేకా మరణంతో దీనిని పోలుస్తూ.. బాబాయ్ హత్య సరే.. పిన్ని సంగతేంటి అంటూ కామెంట్స్ మొదలెట్టారు. దీంతో ఇది సోషల్ మీడియాలో పెద్ద వివాదం అయి కూర్చుంది.
వీరికి తగ్గట్టు టీడీపీ కూడా వీటికి స్పందిస్తూ.. కౌంటర్లు వేసింది. ఆనం వెంకట రమణారెడ్డి లాంటి వాళ్లు గట్టిగానే మాట్లాడారు. పైగా లోకేష్ పై దేవేంద్ర రెడ్డి పెట్టిన పోస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులకు టీడీపీ నేతలు కంప్లయింట్ చేశారు. అయితే వైసీపీ నుంచి కంప్లయింట్ వస్తే తప్ప పోలీసులు స్పందించరన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. కనీసం పోస్ట్ రిమూవ్ చేయించే పని కూడా చేయలేకపోయారు పోలీసులు. విచిత్రం ఏంటంటే.. ఒక్క ట్వీట్ తో మొదలైన ప్రచారం.. తర్వాత ప్రచారానికి అవసరమైన ఫేక్ ఎవిడెన్సులను క్రియేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయాలని చూస్తున్నారు. దీనికి తోడు థంబ్ నైల్స్ తో నడిపించే యూట్యూబ్ చానెల్స్ అన్నీ దీనిని పట్టుకుని స్టోరీలు వేసేస్తున్నారు. అసలు నిజమేంటో ఎవరికీ తెలియదు.
నందమూరి కుటుంబం మాత్రం ఈ పరిణామాలపై బాధపడటం తప్ప ఏమీ చేయలేమంటోంది. తమ ఇంటి ఆడపడుచు ఎలా చనిపోయిందో తమకు తెలుసని చెబుతున్నారు. కొందరు టీడీపీ నేతలైతే.. వివేకా కుటుంబం కోర్టు మెట్లెక్కి మరీ సీబీఐ విచారణ చేయించిందని.. ఇక్కడ అలాంటి వ్యవహారమేదీ లేదని.. ఎవరూ బయటకు కూడా రాలేదని.. అయినా వైసీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే అసలు టీడీపీ స్పందించకుండా ఉండాల్సిందని.. స్పందించబట్టే వివాదం పెద్దదైందని అంటున్నారు. అంతే కాదు.. నందమూరి కుటుంబం సైతం ఉమమహేశ్వరి డిప్రెషన్, ఆత్మహత్యకు గల కారణాలను బ్రీఫ్ గా అయినా వివరిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు.