హిందూ సమాజంలో సమత, మమత, ధార్మిక పురోగతి సాధించడం కోసమే విశాఖ శ్రీ శారదాపీఠం స్వధర్మ వాహిని సంస్థను నెలకొల్పిందని ఆ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి స్పష్టం చేసారు. ధర్మ శాస్త్రాలు, పురాణేతి హాసాలను అనుసరిస్తూ పుణ్య ఫలాలను ఈ సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తామని వివరించారు. విజయవాడలో ఘంటసాల వేంకటేశ్వర రావు సంగీత, నృత్య కళాశాల వేదికగా స్వధర్మ వాహిని సంస్థ తొలి ధార్మిక సమ్మేళనం జరిగింది. ఇందులో ఆలయ సంప్రదాయాన్ని చాటి చెప్పేలా 50మంది కళాకారులు కుంభ హారతి న్యత్యాన్ని ప్రదర్శించారు.
బ్రహ్మాంజలి కూచిపూడి నృత్యంతో అలరించారు. 1008 మంది మహిళలు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసారు. అలాగే 380 మందితో కూడిన కోలాట బృందాలు ఆడి పాడాయి. స్వధర్మ వాహిని తొలి ధార్మిక సమ్మేళనంలో ఆద్యంతం ఆధ్మాత్మిక చైతన్యం వెల్లి విరిసింది. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, తుమ్మలపల్లి హరికృష్ణ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ సమ్మేళనంలో పాల్గొని స్వధర్మ వాహిని సంస్థ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసారు.
ఆగమ వాచస్పతి వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఈ సమ్మేళనానికి నేతృత్వం వహించారు. ఈసందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ స్వధర్మ వాహిని సంస్థ లక్ష్యాలను వివరించారు. హిందువుల నివాసాలను ధర్మ నిలయాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆదేశాలతో స్వధర్మ వాహిని ఏర్పాటు చేయబడిందన్నారు. మధురమైన భక్తి స్రవంతిని ఇంటింటికీ, పల్లె పల్లెకీ దీని ద్వారా అందిస్తామన్నారు. సామాజిక, ఆధ్యాత్మిక, కళా రంగాల్లో స్వధర్మ వాహిని సేవలందిస్తుందని స్పష్టం చేసారు.
త్వరలో కమిటీల నియామకం
భరత జాతి భవిష్యత్తు స్వధర్మ ఆచరణతోనే ముడిపడి ఉందని, హిందువులంతా స్వధర్మ వాహిని కార్యకలాపాల్లో భాగస్వామ్యులు కావాలని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పిలుపునిచ్చారు. సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు త్వరలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన ధార్మిక వేత్తలు స్వధర్మ వాహినితో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో ధార్మిక సేవలు విస్తరిస్తామని వెల్లడించారు.