టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణోత్సవం జరిగింది. ప్రాంగణమంతా వేదమంత్రాలతో మారుమోగింది.
కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు, పీపుల్ టెక్ సంస్థ సీఎండీ , కళ్యాణోత్సవానికి ఆర్థిక సహకారం అందించిన టీజీ.విశ్వప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కళ్యాణమస్తు విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సహకారం తీసుకోవాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కల్యాణమస్తు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా జిల్లా ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశమందిరంలో సోమవారం జెఈవో కళ్యాణమస్తు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీడీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రజాప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన మండళ్లు, స్వచ్ఛంద సేవా సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని జిల్లాల ప్రజాసంబంధాల అధికారులతో కలిసి కళ్యాణమస్తు పై విరివిగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం సహకారం తీసుకుని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కళ్యాణమస్తు పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలను కళ్యాణమస్తుకు అన్ని విధాలా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసి టీటీడీ కళ్యాణమస్తుకి ఇచ్చే సామాగ్రిని వివరించి, స్థానికంగా సమకూర్చుకోవలసిన ఇతర సామగ్రిని గురించి వివరించాలన్నారు. సిఇ శ్రీ నాగేశ్వరరావు, సీఏవో శేష శైలేంద్ర, అదనపు ఎఫ్ఎ సీఏవో రవిప్రసాదు, విజివో మనోహర్, గోసంరక్షణ శాల సంచాలకులు శ్రీ హరినాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలకు డిప్యుటేషన్ పై నియమింపబడిన టీటీడీ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
యోగాతో శారీరక, మానసిక వికాసం – టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
ఆధునిక జీవన విధానంలో యోగా సాధన చేయడం ద్వారా శరీరం, మనసుతో పాటు భావోద్వేగాలను నియంత్రించవచ్చని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని టీటీడీ ఈవో, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ ఉప కులపతి శ్రీ ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ, భగవంతుడు నిర్దేశించిన కర్మలు చేయడానికి ఆత్మ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటుందని, దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. జీవిలోని ఆత్మ పరమాత్మలో ఏ విధంగా విలీనం అవుతుందో భగవద్గీతలో వివరించబడిందన్నారు. జనన, మరణాల మధ్య జరిగే జీవన చక్రంలో యోగా ద్వారా పరిపూర్ణమైన శక్తి సిద్ధిస్తుందని చెప్పారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, మానసిక ప్రశాంతతకు, కోర్కెలు జయించడానికి, మెదడు, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా ఏవిధంగా ఉపయోగపడుతుందో ఈవో వివరించారు.
తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రతిరోజూ యోగా దర్శనం కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ప్రవచనాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోందన్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారం అని, ఇది ఆధ్యాత్మిక సాధనకు చక్కగా తోడ్పడుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం త్వరలో వారంలో ఒక రోజు నాదనీరాజనం వేదికపై యోగ దర్శనం కార్యక్రమంలో ప్రవచనాలకు బదులు ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులతో యోగా ఆసనాలను వేయించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథశర్మ మాట్లాడుతూ ఈ భూమి మీద 47 రకాల నాగరికతలు ఉన్నట్లు, అందులో 46 రకాల నాగరికతలకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని, ప్రస్తుతం ధర్మ బద్ధంగా ఉన్న ఒక నాగరికత మాత్రమే భూమిపై ఉన్నట్లు తెలిపారు. యోగాకు తండ్రి శివుడని, ఆధునిక తండ్రి పతంజలి అని గుర్తు చేశారు. మానవ శరీరం పంచ భూతాలతో నిర్మితమై ఉంటుందని, యోగ శాస్త్రాన్ని, మంత్ర శాస్త్రాన్ని మిళితం చేసి మానవ జీవితాన్ని సఫలం చేసుకోవచ్చని వివరించారు.అనంతరం ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ ప్రధాన యోగాచార్యులు శ్రీ రామనారాయణ పలు యోగాసనాలను ఈవో, అధ్యాపకులు, విద్యార్థులచే వేయించారు.