నిజానికి ప్రత్యేక హోదా అంటే ఏమిటి ? అది ఉండటం వల్ల రాష్ట్రానికి ఒరిగే మేలేంటి, రాకపోతే వచ్చే నష్టం ఏంటి అనే దానిపై అటు ప్రజల్లోనే కాకుండా ఇటు రాజకీయ వర్గాల్లో సైతం పెద్దగా స్పష్టత లేదు. బీజేపీ నాయకులు ఏమో అదే ప్రయోజనాలను ప్యాకేజీ రూపంలో ఇస్తున్నాం కదా అని సమర్థించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆంధ్ర రాజకీయ పార్టీలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఇంత దారుణంగా బీజేపీ వ్యవహరించింది అనేది మేధావులు చేస్తున్న విమర్శ. ఆంధ్ర మేధావులు రాజకీయ పార్టీలను తీవ్రంగా హోదాపై విమర్శిస్తూనే ఉన్నారు మీరు పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్రప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని పలు మార్లు అనేక ఫోరమ్ లో విద్యావంతులు అనేక పార్టీలను ప్రశ్నించారు.కానీ లాభం లేని పరిస్థితి..
దేశంలో ప్రత్యేక హోదా అవసరం ఎలా వచ్చింది?
కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ ఎలా జరగాలనే దాన్ని ఫైనాన్స్ కమీషన్ నిర్ణయిస్తుంది. నిజానికి ఏ మేరకు నిధులు పంపిణీ చేయాలనే విషయాన్ని మాత్రమే అది సూచిస్తుంది. ఆ క్రమంలో 5వ ఫైనాన్స్ కమీషన్ దేశంలో పలు కీలక సిఫార్సులు చేసింది. దాని సూచనలలో భాగంగా 1969లో ప్రత్యేక హోదా అనే కొత్త విధానం ప్రవేశపెట్టారు. రాష్ట్రాల వెనుకబాటుతనమే మొదట్లో దీనికి నేపథ్యం. అలా అసోం, నాగాలాండ్, మరో ప్రత్యేక కారణంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వచ్చాయి. అక్కడి స్థానిక పరిస్థితిని అనుసరించి మరో 8 రాష్ట్రాలను సైతం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అర్హమైనవిగా తేల్చారు. మొత్తానికి లోతైన అధ్యయనం లేకుండా ఈ ఎనిమిది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ప్రస్తుతం ఆ విధంగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకూ ప్రత్యేక హోదా ఉంది. మొదటి మూడింటితో కలిపి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ఇటీవల ఏపీతో పాటు బీహార్, చత్తీస్ ఘడ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదాపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది.
ఏ ప్రాతిపదికన ప్రత్యేక హోదా ఇస్తారు ?
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
* విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాలుగా ఉండాలి.
* పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలై ఉండాలి.
* ఆర్థిక వనరులు సొంతంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిపుష్టత లేని ప్రాంతమై ఉండాలి.
* జనసాంద్రత తక్కువగా ఉండాలి, గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి.
* సరైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా ఉండాలి.
ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు :
సాధారణ రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తారు.
* ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90శాతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి.
* గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి రాష్ట్రం కేంద్రానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే అప్పు రూపంలో వచ్చిన నిధులను మాత్రం తిరిగి చెల్లించాల్సిందే.
* ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు సైతం భారీగా రాయితీలు ఇస్తారు. 100శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్నులో సైతం 100% రాయితీ లభిస్తుంది.
పన్ను మినహాయింపులు, కొన్ని ప్రత్యేక రీయింబర్స్ మెంట్లు ఉన్నట్లయితే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారు.
* పదేళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తే ఏపీలోని ప్రతి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు వీలుంటుంది.
* అంతే కాకుండా పన్ను రాయితీలు, పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాల కారణంగా అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి.
* కరెంటు సగం ధరకే లభ్యమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో పరిశ్రమలకు మేలు జరుగుతుంది.
* వీటితో పాటు ఇంకా తెలియని అనేక పరోక్ష లాభాలను సైతం పొందవచ్చు.
హోదాతో ఇటీవల లబ్ధి పొందిన రాష్ట్రాలు :
ప్రత్యేక హోదా ఉన్న కారణంగానే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి.
తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగినట్లు లెక్కలున్నాయి.
ఏపీ కంటే వెనుకబడ్డ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కారణంగా పది వేల పరిశ్రమలు కొత్తగా వచ్చినట్లు చెబుతున్నారు. అలాంటిది 5 కోట్ల ప్రజలు, రాజధాని నిర్మాణం లేని రాష్ట్రం, రెండో అతిపెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే అది పెద్ద సంజీవనే కాగలదు అనేది కాదనలేని నిజం.
ఆంధ్ర సీఎం జగన్ రెడ్డి వినతి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అల్లూరి సీతారామ రాజు విగ్రహావిషకరణకు వచ్చిన దేశ ప్రధానిని సీఎం జగన్ రెడ్డి అభ్యర్ధించారు పోలవరం నిధుల విషయం లో అదేవిధంగా అనేక విషయాల్లో ఆంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలని విన్నవించారు ఐతే ఎక్కడ గట్టిగ తన రాష్ట్ర ప్రజల వాణి వినిపించకుండా కేవలం వినతులతో ఎం సాధిస్తారని ప్రతిపక్షాలు ప్రజలు బాహాటంగా విమర్శించటం కొసమెరుపు ఇప్పటికైనా పాలకులు ఆంధ్ర ప్రజల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.