సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అధికార పార్టీ ఇప్పటికే “గడప గడపకు మన ప్రభుత్వం” అంటూ కార్యక్రమం చేపట్టింది. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యే లు నిత్యం ప్రజల్లో ఉండాలని, సమస్యలు తీర్చాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టు ప్రణాళికలు చేసుకుంటున్నారు.
ఇక జనసేనాని కూడా తమ పార్టీని నిత్యం ప్రజల్లో ఉంచాలని చూస్తున్నారు. ” కౌలు రైతు భరోసా యాత్ర” పేరుతో ప్రజల్లో ఉండే విధంగా చూసుకుంటున్నారు. అంతేకాక జనవాణి నిర్వహించి ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యల మీద చర్చిస్తున్నారు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమవుతోంది. ఎన్నికల నాటికి జనాల్లో విస్తృతంగా పర్యటించాలని ఈ ప్రణాళిక ఉండబోతుంది అని జనసైనికుల మాట.
ప్రధాన ప్రతిపక్షం ఈ విషయంలో అంటే ఎన్నికల కోసం ఏర్పాట్లు చూస్తే కాస్త వెనకపడినట్లు ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు “బాదుడే బాదుడు” లాంటి కార్యక్రమం చేపట్టిన, అధికార వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం లో, ప్రభుత్వ వ్యతిరేకత ను సొమ్ము చేసుకోవడంలో విఫలం అయ్యారని చెప్పక తప్పదు. మూడు నెలల క్రితం ఒంగోలు లో నిర్వహించిన మహానాడు తరువాత పార్టీ కార్యకర్తల్లో మంచి ఉత్సాహం కనిపించిన దానిని కొనసాగించడంలో టీడీపీ విఫలం చెందింది.
ఆ లోటుని పూర్తి చేయడానికి చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొవాలంటే మరేదైనా భారీ కార్యక్రమం చేపట్టాలని నారా లోకేష్ ఆలోచిస్తున్నారు అంట. దాని ప్రకారం ఎన్నికల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలుస్తోంది. మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని,ఇందుకోసం ఆయన మానసికంగా సిద్ధమైనట్లు సమాచారం.పాదయాత్రను ఎక్కడి నుంచి మొదలుపెడతారు,ఎలా ముగిస్తారు? ఏయే నియోజకవర్గాలను టచ్ చేస్తారు? బహిరంగ సభల షెడ్యూల్ పై లోకేష్ పూర్తిగా ఫోకస్ చేసినట్లు సమాచారం. పాదయాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.ఏది ఏమైనా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని లోకేష్ బలంగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.