ప్రేమ, యుద్ధం ఈ రెండు పరస్పర విరుద్ధ భావాలు. కానీ కొన్ని సార్లు ప్రేమ కోసం యుద్ధం చేయక తప్పదు. కొన్నిసార్లు యుద్ధంలో కూడా ప్రేమ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రేమ, యుద్ధం రెండూ కలిసినప్పుడు ఏర్పడే అనుభూతి గురించి మాటల్లో మాత్రం చెప్పలేము. ఒక యుద్ధం రెండు వేర్వేరు నేపధ్యాలను కలిపే ఉత్తరమే ఈ సీతారామం చిత్రం. ఈ రోజుల్లో లవ్ స్టోరీస్ కి అర్ధం మారిపోయింది. లిప్ లాక్స్ లేని సీన్స్ ఉంటెనే ప్రేమ కథ అనిపించుకోదు అనే మాటకు ఈ సీతారామం ప్రేమ కథ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ కనిపించక, వినిపించక చాలా కాలమయ్యింది. అలాంటి టైంలో వచ్చిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది.
దేశమంటే ఒక సైనికుడికి చాలా ఇష్టం. ఆ సైనికుడంటే ఒక అమ్మాయికి ఇష్టం. ఇద్దరి మధ్య జరిగే ఒక ట్రావెల్ ఈ మూవీ సీతారామం. తాను చేరాల్సిన గమ్యం కోసం పాకిస్థాన్‌లో ఇరవై ఏళ్లుగా ఓ ఉత్తరం ఎదురుచూస్తూ ఉంటుంది. హైదరాబాద్‌లో ఉన్న సీతామాలక్ష్మి కోసం లెఫ్ట్‌నెంట్ రామ్ గా కనిపించే దుల్కర్ సల్మాన్ ఆ ఉత్తరాన్ని రాస్తాడు. ఐతే ఆ ఉత్తరాన్ని చేర్చాల్సిన బాధ్యత అఫ్రిన్ గా నటించిన రష్మిక పై పడుతుంది. రష్మిక తాతయ్యగా నటించిన సచిన్ ఖేడ్కర్ ఆఖరి కోరిక కూడా అదే. ఆ ఉత్తరాన్ని చేర్చాల్సిన చోటకి చేర్చకపోతే తన తాతయ్య ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తనకు రాదనే భయంతో తనకు ఇష్టం లేకపోయినా ఆ ఉత్తరాన్ని తీసుకుని హైదరాబాద్ వస్తుంది. అందరినీ కలుస్తుంది. తన జర్నీలో రష్మిక రామ్, సీతామాలష్మి గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటుంది.
లెఫ్ట్ నెంట్ రామ్ ఒక అనాథ. సైన్యం, దేశం తప్ప అతనికి ఇంకేం తెలీవు. హఠాత్తుగా సీతామాలక్ష్మి పేరుతో తనకు ఉత్తరాలు వస్తుంటాయి. ఆ ఉత్తరానికి రిప్లై రాద్దామంటే అడ్రస్ రాయరు దాని మీద. ఆ ఉత్తరాల్ని చదవడం పూర్తయ్యాక, మరో ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇదే రామ్ దినచర్య అయిపోతుంది. సడన్‌గా ఒక రోజు సీతామాలక్ష్మిని కలుస్తాడు మన రామ్. ఇద్దరి మధ్యా స్నేహం మొదలై ప్రేమగా మారుతుంది. `నన్ను పెళ్లి చేసుకుంటావా..` అని అడిగిన ప్రశ్నకు సీత నుంచి ఎలాంటి సమాధారం రాదు. దానికి కారణం వేరే ఉంది. అలా కలుసుకున్న సీత, రామ్ మళ్లీ విడిపోతారు. సీత కోసం రామ్ రాసిన ఉత్తరం పాకిస్థాన్‌లో ఎందుకు ఆగిపోయింది. ఆ ఉత్తరాన్ని చేర్చే బాధ్యత భుజాన వేసుకున్న అఫ్రిన్ తన బాధ్యత నెరవేర్చిందా, లేదా ? అసలు రామ్, సీత ఎందుకు విడిపోయారు ? వారిద్దరికీ పెళ్లి జరిగిందా, లేదా ? అనేవి మిగిలిన విషయాలు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అని ఈ సినిమాకి ట్యాగ్ లైన్ పెట్టారు. అసలు ఆ టాగ్ లైన్ ఎందుకు పెట్టారు అనే విషయం సినిమా చూశాకే ప్రేక్షకులకు అర్ధమౌతుంది.
ఈ ట్యాగ్ లైన్‌కి కూడా డైరెక్టర్ న్యాయం చేశాడు. యుద్ధం – ప్రేమ ఈ రెండు అంశాల్నీ బాలెన్స్ చేస్తూ ఈ కథ చెప్పాడు. యుద్ధ వాతావరణంతో కథ మొదలవుతుంది. పాకిస్థాన్‌లోని తీవ్రవాదులు కశ్మీర్‌లో ఎలా విధ్వంసం సృష్టించాలనుకొన్నారు ? అనే పాయింట్ తో కథ చెప్పడం మొదలు పెట్టాడు డైరెక్టర్. అయితే మనసులో మాత్రం `సీతారామం`ల ప్రేమ కథ ఎప్పుడు మొదలవుతుందా ? అనే ఆసక్తితోనే ప్రేక్షకుడు సినిమా చూస్తుంటాడు. యుద్ధ నేపథ్యానికీ, కశ్మీర్ అల్లర్లకీ అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చాడో ? అనిపిస్తుంది. ఆ లెంగ్త్ కీ చివర్లోనే జస్టిఫికేషన్ చేశాడు డైరెక్టర్. ఎప్పుడైతే రామ్ కి ఉత్తరాలు రావడం మొదలవుతుందో అప్పటి నుంచీ ఈ కథ లవ్ స్టోరీలా మారిపోతుంది. సీతని వెతుక్కుంటూ రామ్ వెళ్లడం, వారిద్దరి జర్నీని పొయెటిక్‌గా చిత్రీకరించారు. రామ్ – సీత మాట్లాడుకుంటుంటే, పొయెట్రీలా అనిపిస్తుంటుంది. వాళ్ల మాటలూ ఉత్తరం – ప్రత్యుత్తరం లానే అనిపిస్తాయి. వెన్నెల కిషోర్, సునీల్ లాంటి వాళ్లని తీసుకొచ్చి కాస్త కామెడీ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ, అది కుదర్లేదు. పైగా వారిద్దరి గెటప్పులూ ఎందుకో సూటవ్వలేదనిపిస్తుంది. అది మినహా ఫస్టాఫ్ లో కంప్లైంట్స్ ఏమీ ఉండవు. పాటలెప్పుడొస్తాయో కూడా తెలియనంతగా కథలో భాగమైపోయాయి. ఇంట్రవెల్ లో ఓ ఊహించని ట్విస్ట్ వస్తుంది. దాంతో కథకు బ్రేక్ పడుతుంది. ఇదో లవ్ స్టోరీ. అందులోనూ కొన్ని ఆసక్తి కరమైన ట్విస్టులు రాసుకుని, ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు డైరెక్టర్. అసలు కథ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ఇద్దరి ఎమోషన్స్ పీక్స్ అని చెప్పొచ్చు.
సీత బ్యాక్ గ్రౌండ్ తెలిశాక ఆమె పాత్రపై ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే సీతని ప్రేమించడం మొదలెడతారో, అక్కడి నుంచీ లవ్ స్టోరీని కూడా ప్రేమిస్తారు ఆడియన్స్. రామ్ తనకు ఎవరైతే ఉత్తరాలు రాశారో… వాళ్లందరినీ వెళ్లి కలవడం – చివర్లో ఓ చెల్లె దగ్గరకు వెళ్లి, అన్నలా తన బాధ్యత తీసుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. విష్ణుశర్మ పాత్ర ఈ కథకు అత్యంత కీలకమైనది. ఆ పాత్ర వల్ల కథ స్వరూపమే మారిపోతుంది. దేశం కోసం ప్రాణాన్నీ, ప్రేమనీ త్యాగం చేస్తున్నప్పుడు లెఫ్టినెంట్ రామ్ ఎంత ఉన్నతంగా కనిపిస్తాడో, అతని కోసం ఎదురు చూపుల్లో బతికేసే – సీతని చూసినప్పుడు కూడా అంతే గొప్పగా అనిపిస్తుంది. కథానాయకుడు, కథానాయిక పాతల్ని సమానంగా ప్రేమించిప్పుడే ఇలాంటి పాత్రల పంపకం జరుగుతుందేమో..? అఫ్రిన్ పాత్రకు ఇచ్చిన ముగింపు చూస్తే, డైరెక్టర్ ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం. అసలు ఆ పాత్రని అలా (ఎలా అనేది సినిమా చూశాక తెలుసుకోవాలి) ముగించడం వల్ల కథకు మరింత అందం వచ్చింది. అదొక్కటే కాదు. ప్రతీ పాత్రని దర్శకుడు తెలివిగా వాడుకొన్నాడనిపిస్తుంది. చివరి 30 నిమిషాలూ ఈ కథ స్థాయిని పెంచుకొంటూ వెళ్లాయి. `ఇప్పుడు మీరు క్షమాపణలు అడక్కపోతే చచ్చిపోయేట్టు ఉన్నాను` అని అఫ్రిన్ చెబుతున్నప్పుడు ఎవరికైనా సరే, నీళ్లు గిర్రున తిరుగుతాయి. ఓ ప్రేమకథకు ఉద్వేగభరితమైన ముగింపు లభిస్తే అలాంటి కథలు చాలా కాలం వరకూ గుర్తుండిపోతాయి. అలాంటి కథల్లో `సీతారామం` కూడా చేరుతుంది. దుల్కర్ ఈ కథకు ప్రాణంపోశాడు. రామ్ పాత్రలో.. అల్లుకుపోయాడు. తన అందం, మాటతీరు, నడుచుకొనే పద్ధతి, ఎమోషన్స్ పండించిన తీరు ఇలా అన్ని కోణాల్లోనూ ఈ పాత్రకు పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు. దుల్కర్ కళ్ళల్లో రొమాన్స్ కనిపిస్తుంది. మృణాల్ పాత్ర నెమ్మది నెమ్మదిగా నచుతుంది. మెల్లమెల్లగా ఆ పాత్రనీ, దాని స్వభావాన్నీ అర్థం చేసుకున్న తరవాత సీత పాత్రనీ ప్రేమించేస్తాం. పొగరున్న అమ్మాయి పాత్రలో అఫ్రిన్ కనిపించి అలరిస్తుంది. సుమంత్ ది కూడా సర్‌ప్రైజింగ్ పాత్రే. ప్రతీ చిన్న పాత్రకూ పేరున్న వాళ్లని తీసుకోవడం వల్ల ఒక్క సీన్ అయినా సరే, గుర్తుండిపోతుంది. టెక్నికల్‌గా ఈ సినిమాకి వంక పెట్టలేం. 1965, 1985 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోయారు. ఈ మూవీ చాలా నాచురల్ గా అనిపిస్తుంది.
ఈ మూవీకి సంబంధించి పాటలు ఇది వరకే హిట్టు.
`ఇంతందం` పాట వెండి తెరపై మరింత బాగుంది. కశ్మీర్ అందాల్ని మనోహరంగా చూపించారు. మాటలు కొన్నిసార్లు కవితాత్మకంగా వినిపిస్తూ ఉంటాయి. ఇన్ని విభాగాల్లో శ్రద్ధ తీసుకున్న టీమ్ ఇరవై ఏళ్ల లెటర్ ని తెల్లని మల్లెపువ్వులా చూపించడం మాత్రం అతకలేదు. హను ప్రేమకథల్ని అందంగా తీయడంలో నేర్పరి. ఈసారి చాలా బలమైన కథని ఎంచుకున్నాడు. విభిన్న పార్వ్శాలున్న కథ దొరకడం, వైజయంతీ మూవీస్ లాంటి సంస్థ తోడవ్వడం తనకు మరింత బలాన్నిచ్చింది. తొలి సగంలో అక్కడక్కడ ఫ్లాట్ నేరేషన్ బోర్ కొట్టించినా.. రెండో సగంలో భావోద్వేగాల్ని పీక్స్‌లోకి తీసుకెళ్లి, పాత్రలన్నింటినీ సమర్థంగా వాడుకుని ఓ ఎమోషనల్ క్లైమాక్స్ తో కథని ముగించాడు. ప్రేమించిన అమ్మాయిని `గారూ.. మీరూ` అని పిలవడం దగ్గర్నుంచి, ఒక్క ముద్దు సన్నివేశం కూడా లేకుండా, ఎక్కడా తల దించుకుని – దొంగ చూపులు చూడాల్సిన పరిస్థితి తీసుకురానివ్వదు. ఇప్పుడు ఇది ఒక క్లీన్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోనుంది.