పరిశీలిస్తే తప్పేంటి
అక్రమ తవ్వకాలు నిజం కాబట్టే పోలీసులను పెట్టి అడ్డగింతలు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు
విశాఖ నగరంలోని ప్రకృతి అందాలకు నిలవైన రుషికొండ ఏరియా భారత్`పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ప్రకృతి విధ్వంసానికి గురవుతున్న రుషికొండను సందర్శించాలని సీపీఐ శ్రేణులతో కలసి తవ్వకాలు జరుగుతున్న ప్రాంత సందర్శనకు బయలు దేరారు. ఆయన పర్యటన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన నగర పోలీసులు దారి పొడవునా ఆయన్ను అనుసరిస్తూ బీమిలీ వెళ్లే దారిలోని రుషికొండ జంక్షన్ వద్ద వందలాది మంది పోలీసులతో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అటకాయించారు. తవ్వకాలు జరుగుతున్న రుషికొండకు వెళ్ల కుండా నిలువరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన నారాయణ పోలీసులతో తమను ఎందుకు ఆపుతున్నారని పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ఏమైనా పాక్ సరిహద్దులో ఉందా అంటూ నిలదీశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారి కేడ్లను, రోప్ వేలను దాటుకుంటూ ముందుకెళుతున్న తరుణంలో మధురవాడ ఏసీపీ శ్రీనివాస్ సీపీఐ నేతలతో ఈ పర్యటనకు ముందస్తు అనుమతులు లేని కారణంగానే రుషికొండకు వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. రుషికొండను తాము పరిశీలించడానికి వెళితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని నారాయణ పోలీసులను నిలస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు రోప్ వేలతో నారాయణ సహా పార్టీ శ్రేణులను అటకాయించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రకృతిని నాశనం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రకృతి అందాలతో, స్వయం సంవృద్ధిని పొందున్న నగరంపై ప్రభుత్వం కక్ష కట్టినట్టు పేర్కొన్నారు. అందాల నిలవైన కొండలను అక్రమంగా తవ్వేస్తూ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు ఎరాకలల్లో నిర్మాణాలకు అనుమతులు పొందిన టూరిజం విభాగం 25 ఏకరాలకు పైగా తవ్వి రుషికొండను నామరూపాలు లేకుండా చేసిందని దుయ్యబట్టారు. తవ్వడానికి కూలీలకు సొమ్ము చెల్లిస్తున్నామని చెబుతున్న యంత్రాంగం తవ్వి తీసిన గ్రావెల్‌ను అక్రమంగా అమ్ముకుంటూ వంద కోట్లు దండుకుంటోందని దుయ్యబట్టారు.
ఆ సొమ్ము ఎక్కడకి వెళుతోందో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. కోర్టులు కూడా ప్రకృతి విధ్వంసాన్ని తప్పుపడుతున్న తరుణంలో అవేమీ పట్టని సీఎం జగన్ తన దుర్మార్గమైన విధానాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రురుషికొండలో అక్రమతవ్వకాలు నిజమని తేలితే జైలు తప్పదని కోర్టులో హెచ్చరించినా అధికారులకు భయం లేకుండా పోయిందని మండిపడ్డారు. జగన్ 17 నెలలు జైలులో ఉండి సీఎం అయిన నేపథ్యం కారణంగానే అధికారుల్లో కోర్టులంటే భయం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉంటూ చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే అక్కడ అక్రమ నిర్మాణాలను చేపడితే ప్రకృతిని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. ప్రజలను, రాజకీయ పార్టీలను రుషికొండను చూడడానికి కూడా అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఆసాంఘిక కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అటువంటిది ఏమీ లేకపోతే తమను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడం దారుణమని పేర్కొన్నారు. ప్రకృతిని నాశనం చేయడం ఉరి శిక్షకు సమానమైన నేరమని వ్యాఖ్యానించారు. అందాల నెలవైన నరగరాన్ని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రకృతి విధ్వంసం చేసే ప్రత్యేకమైన హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయా అంటూ ధ్వజమెత్తారు. ఈ విషయంలో సీపీఐ కూడా న్యాయపోరాటం చేస్తుందని, మరో వైపు నగర ప్రజలను సమీకరించి సహజసిద్దమైన అందాల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వ చర్యలపై పోరాటం చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ విమల, కే సత్యాంజనేయ, ఎస్‌కే రెహమాన్, పీ చంద్రశేఖర్, ఆర్ శ్రీనివాసరావు, సీఎన్ క్షేత్రపాల్, పార్టీ నేతలు ఎస్ మురళి, వై రాంబాబు, జా పణీంద్ర, యు నాగరాజు, ఎం మన్మధరావు,వై త్రినాధ్, వి సత్యనారాయణ, ఏ ఆదినారాయణ, ఎంఎస్ పాత్రుడు తదితరులలో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.