రఘురామకృష్ణంరాజు.. మీడియా పెట్టుకున్న ముద్దు పేరు ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన రచ్చబండ అంటూ మొదలెట్టారో గాని.. వైసీపీ ప్రభుత్వాన్ని ఆ బండకేసి బాదుతూనే ఉన్నారని.. ఆయన అభిమానులు అంటుంటారు. ప్రత్యర్ధులు కూడా ఓపెన్ గా చెప్పడానికి భయపడే విషయాలను కూడా.. ఆయన డైరెక్టుగా ప్రెస్ మీట్ పెట్టి.. పైగా వైసీపీ ఎంపీ అయి ఉండి కూడా .. అటాక్ చేస్తున్నారు. కొరకరాని కొయ్యలా తయారైన ఆయనను సీఐడీ పోలీసులు ఒకసారి అరెస్ట్ చేశారు. తనను కొట్టారని ఆయన ఆరోపించారు కూడా. దీనిపై చివరికి సుప్రీంకోర్టు నమ్మి.. ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఆయనకు దెబ్బలు తగిలింది నిజమేనని హైదరాబాద్ మిలటరీ ఆస్పత్రి వైద్యులు రిపోర్టు ఇచ్చారు. అంతటితో ఆయన ఆగిపోతారని చాలామంది అనుకున్నారు. కాని ఆయన మాత్రం ఆగలేదు. ఇంకా ఇంటెన్సిటీ పెంచేశారు. ఆయనను సస్పెన్షన్ లో పెట్టలేక.. పార్టీ ఎంపీగా గుర్తించలేక వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు.
ఇలాంటి రఘురామకృష్ణంరాజు నర్సాపురంలో మళ్లీ గెలుస్తారా? అనేది ఒక వాదన. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదు. అక్కడికి వచ్చే పరిస్ధితి లేదు. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు కేంద్రం ఆహ్వానం ఉన్నా.. దానిని చింపేసి మరీ కొత్త లిస్టు తయారు చేసిన స్టేట్ గవర్నమెంట్ ఆయనను రానివ్వలేదు. పైగా వచ్చే దారిలో హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. రఘురామకృష్ణరాజుకు ఆయన సామాజికవర్గం నుంచి బాగానే మద్దతు దొరికినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మధ్య పవన్ కల్యాణ్ సైతం ఆయన పట్ల సానుభూతి చూపించారు. గోదావరి జిల్లాల్లో రాజులు, కాపులు కలిస్తే వ్యవహారం మామూలుగా ఉండదు. అందుకే ఆర్ఆర్ఆర్ ఈసారి జనసేనలో చేరతారా అనే ప్రచారం కూడా జరిగింది.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన టీడీపీ తరపునే పోటీ చేస్తారని తెలుస్తోంది. పైగా ఆయన గుంటూరు సీటు అడుగుతున్నారంట. ఎందుకంటే అది సేఫెస్ట్ సీటు టీడీపీకి అని చెబుతున్నారు. ఎందుకంటే ఈసారి గుంటూరు జిల్లాలో వైసీపీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కూడా గెలవలేదనే టాక్ వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. టీడీపీ అలాగే ప్రచారం చేస్తుంది. అందుకే ఆయన టీడీపీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు గల్లా జయదేవ్ తన సొంత ప్రాంతం అయిన చిత్తూరుకు వెళతారని కూడా చెప్పుకుంటున్నారు. మరో వైపు నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇదే సీటు కావాలని టీడీపీని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరి టీడీపీ ఎవరికి ఎక్కడ సీటు కన్ ఫామ్ చేస్తుందో తెలియదు. ఎప్పుడన్నా చంద్రబాబునాయుడు పర్యటనలో అన్నా చెప్పాలి.. లేదా లోకేష్ అన్నా ప్రకటించాలి. ఇప్పుడే అయితే అది జరగకపోవచ్చు. ఈ విషయంపై మరింత క్లారిటీ రావడానికి మరో రెండు నెలలు చాలని అంటున్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ ప్రయత్నిస్తున్నది మాత్రం నిజమేనంటున్నారు.. అలాగే అటు కృష్ణదేవరాయలు కూడా ప్రయత్నిస్తున్నది నిజమేనంటున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇద్దరూ ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా ఉన్నారు.