సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్దతులను అనుసరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నగర ప్రజలకు చెత్తను సేకరించి దాన్నుంచి ఈ-వేస్ట్ ను వేరు చేసి అందించే ప్రక్రియ పై అవగాహనా చాలా అవసరం. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, ఐ.ఏ.ఎస్., సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ నగరంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల వలన కలిగే అనర్థాల వాళ్ళ ప్రజలకు అవగాహన కల్పించుటకు నగరపాలక సంస్థ మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతుందని, రాబోవు రోజులలో విజయవాడ నగరం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సాధించుటకు నగర ప్రజలు సహకారం అందించాలన్నారు. అదే విధంగా సింగ్ నగర్ ప్రాంతములో ఇ- వేస్ట్ మరియు ఫ్లవర్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రారంభించుకోవటం జరిగిందని వీటి వల్ల నగరంలో కాలుష్యాన్ని తగ్గించి విజయవాడ నగరం ఒక మోడల్ నగరంగా రూపాంతరం చెందుతుందని ఆకాంక్షించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో పూల మార్కెట్లు మరియు అనేక కళ్యాణ మండపములు వారు పూలవ్యర్ధములను కాలువగట్ల వెంబడి లేదా డంపింగ్ యార్డ్ ల యందు పడవేయుట జరుగుతుందని, విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా అనేక సంస్కరణలను అమలు చేస్తుందన్నారు. ప్రధానంగా నగరంలో ఉత్పత్తి ఆగుతున్న ఫ్లవర్ వేస్ట్ నుండి అగురబత్తి తయారు చేయడం ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం సమకుర్చుటయే కాకుండా నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుటకు అవకాశం ఉంటుందన్నారు.
సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును మెరుగుపరచుటలో భాగంగా ప్రతి ఇంటి వారు చెత్త సేకరణ సమయంలో ఫ్లవర్ వేస్ట్ మరియు ఇ- వేస్ట్ లను వేరు చేసి అందించవలేనని, ఫ్లవర్ వ్యర్ధములను ఈ విధమైన రీసైక్లింగ్ యూనిట్ లలో దూప్ స్టిక్స్ వంటి సుగంద పరిమళాలు వెదజల్లు ఉత్పత్తులను తయారు చేయుట జరుగునని అన్నారు. దీనిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ గ్రీన్ వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సోలుషన్స్ వారి సహకారంతో నివాసాలు, ఫ్లవర్ మార్కెట్స్, దేవాలయాలు మరియు కళ్యాణ మండపాలలో ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న పూలవ్యర్ధములను, విద్యా సంస్థలు, కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణముల సంస్థల నుండి వచ్చు ఇ-వేస్ట్ బ్యాటరీలు, హెడ్ ఫోన్, సెల్ ఫోన్, ఫ్లవర్ వ్యర్థాల ద్వారా ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు వెలువడి ఆరోగ్యమునకు భంగం కల్గించునని వీటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేయుట ద్వారా సక్రమ పద్దతిలో ఈ కేంద్రము ద్వారా రీసైక్లింగ్ చేయటం జరుగుతుందని తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చన్నారు.
ముందుగా సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఫ్లవర్ వేస్ట్, ఇ-వేస్ట్ మేనేజ్ మెంట్ సెంటర్ ప్రారంభ కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ పాల్గొని ఆవరణలో మొక్కలు నాటారు.