కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్‌ఫామ్‌లపైకి చేరి.. విధ్వంసం మొదలుపెట్టారు. సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు సికింద్రాబాద్‌కు పోటెత్తడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితికి పోలీసులు చేరుకున్నారు. ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది. ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పార్శిల్ రైలుతో పాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో 2 బోగిలు దగ్ధం అయ్యాయని, 40 బైక్‌లు కూడా ధ్వంసం చేశారని రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు. 44 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు 15 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ఇక నిరసనకారుల ఆందోళనతో అధికారులు రైళ్లను నిలిపివేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనకు ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ చేస్తుందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ఘటన పథకం ప్రకారమే -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అగ్నిపథ్ వంటి పథకాలు దేశంలో చాలా ఉన్నాయి. అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. సికింద్రాబాద్ ఘటన పథకం ప్రకారమే కుట్రచేసి విధ్వంసం సృష్టించారు. ఇది బలవంతపు ట్రైనింగ్ కాదు, స్వచ్చందంగా సైన్యంలో చేరవచ్చు. జాతీయభావం తీసుకురావడంతో భాగంగా అగ్నిపథ్‌ను తీసుకువచ్చాము. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ విధ్వంసంపై వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. ఈ ఆందోళనలు కొన్ని రాజకీయ పార్టీల అండతోనే విధ్వంసం జరిగిందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
సికింద్రాబాద్ ఘటన విచారకరం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దుర దృష్టకరమని, ఆ ఆందోళనలో ఒకరు మృతి చెందినట్లు. ఆ మృతి చెందిన యువకుడు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్ గా తేలడం, పలువురు గాయపడటం ఆవేదన కలిగిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ఆనాలోచిత, ఆపరిపక్వ, అసంబద్ధ ఆలోచన వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది-బండి సంజయ్
ఆర్మీస్టూడెంట్స్ ముసుగులో కొంత మంది వ్యక్తులు వచ్చి రైళ్లు దగ్దం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘ఈ విధ్వంసం ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి జరిపించింది. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంత జరిగినా నీ ఇంటెలిజెన్స్ ఏమైంది?. అందుకే రాష్ట్రంలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి. ఆర్మీ విద్యార్థులకు ఈ ఘటనతో ఏం సంబంధం లేదు. మోడీ మీకు అన్యాయం చేసే వ్యక్తి కాదు. మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తారు. ఏ విధ్వంసం జరిగినా విద్యార్థులు వెళ్లొద్దు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు దృష్టి మరల్చేందుకే ఈ ఘటనలు అని’ బండి సంజయ్ అన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఘటన దురదృష్టకరం -పవన్ కళ్యాణ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
రైల్వే అస్తులు ధ్వంసం వెనుక కుట్రవుంది- సోమువీర్రాజు
యువతకు భారత సైన్యంలో అవకాశం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపద్ పధకం యువతకు చాలా ఉపయోగకరం అయితే ఈ విషయాలు తెలియని యువత అవేశాలకు లోను అవుతున్నారు . సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్ లలో విధ్వంసం స్రృష్టించిన వారు సంఘవిద్రోహులుగా అనుమానాలు కలుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు.
అగ్ని పథ్’ ను రద్దు చేయాలి – సీతరాం ఏచూరి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపధ్’ పథకాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల జేసింది. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను అర్ధాంతరంగా ఎందుకు మార్చారు? : కె.నారాయణ
అగ్నిపద్ పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనపై ఆయన స్పందించారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. దాని ఫలితమే ఈహింసాకాండ అని ఆరోపించారు. సైనిక రిక్రూట్మెంట్ విధానాన్ని అర్ధాంతరంగా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు.15 నెలల్లోనే 10లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనలోనే దగా ఉందని నారాయణ ఆరోపించారు.నిరుద్యోగులను మాయ చేసే దుర్మార్గపు ఆలోచనల నేపథ్యంలోనే అగ్నిపథన్ను.తీసుకొస్తున్నారని
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి-మధు యాష్కీ గౌడ్
దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని, రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు.