చినజీయర్ స్వామికి కేసుల చిక్కులూ ఎదురొస్తున్నాయి. ఆయన భక్తులకు అమ్మే ప్రసాదంలో అవకతవకలు జరుగుతున్నాయని ఓ భక్తుడు ఫిర్యాదు చేయగానే.. పోలీసులు సమతామూర్తి నిర్వాహకులుపై కేసులు నమోదు చేశారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమం.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో పంచుతున్న ప్రసాదాల విషయంలో చాలా సందేహాలున్నాయని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై లీగల్ మెట్రాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టేందుకు కంప్లెయింట్ కూడా చేశారు. ఈ మేరకు ప్రసాదం ప్యాకెట్ల బరువు, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్ వంటివేవీ ఉండడం లేదని ఆ కంప్లెయింట్‌లో ఫిర్యాదు దారు వినయ్ వంగల పేర్కొన్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ అధికారులు ఆశ్రమానికి వెళ్లి పరిశీలించారు.
ఫిర్యాదు దారు కంప్లెయింట్‌లో పేర్కొన్నట్టు ప్రసాదం ప్యాకెట్లపై ఎట్లాంటి మేజర్స్ లేవని, మరెలాంటి డిటెయిల్స్ పొందుపరచలేదని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిపిన తనిఖీల ఆధారంగా సెక్షన్ 10,11,12,14, ఉల్లంఘనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.. మామూలుగా అయితే భక్తులు కానీ.. ప్రభుత్వం కానీ ఇలాంటి వాటిని చూసీ చూడకుండా పోతుంది. ఇంత చిన్న విషయానికి నేరుగా సమతామూర్తి నిర్వాహకులపై కేసులు పెట్టే వరకూ వెళ్లరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వినయ్ వంగాల అనే వ్యక్తి కూడా అక్కడ లోపాలు వెదకడానికే వెళ్లినట్లుగా ఉంది. ఆయన పిలవడం.. వెంటనే అధికారులు వచ్చి కేసులు నమోదు చేయడంతో ఇది సాధారణంగా జరిగింది కాదన్న అభిప్రాయం ఎక్కువ మందికి వస్తోంది.