పోలవరం కాంగ్రెస్ మానసపుత్రిక…జాతీయ ప్రాజెక్ట్
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు రైతు వ్యతిరేఖ నిర్ణయం
బీజేపీ అమరావతి పాదయాత్ర కపట నాటకం
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగు నీరు, తాగు నీరు, పారిశ్రామిక నీరు, జల విద్యుత్, జల రవాణా, నదుల అనుసంధానం ఇలా బహుళ ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు ద్వారా సిద్ధిస్తాయని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు రైతు వ్యతిరేఖ నిర్ణయం అని పేర్కొన్నారు.
పోలవరం బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అని ప్రకృతి రాష్ట్రానికి ప్రసాదించిన వరమని తులసిరెడ్డి అన్నారు. పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక, జాతీయ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటేకే పోలవరం పూర్తి అయ్యివుండేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 30 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు నిధులు తెప్పించే శక్తి సొంతంగా భరించే శక్తి లేదని అన్నారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్న “భారత్ జోడో యాత్ర” ఏపీలో 100 కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. యాత్ర రాయదుర్గంలో ప్రారంభమై రెండు పార్లమెంటు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తులసిరెడ్డి పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని, అనంతపురం, కర్నూల్ లోక్ సభ నియోజక వర్గాల పరిధిలోని రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజక వర్గాల మీదుగా ఈ యాత్ర సాగుతుందని తులసిరెడ్డి అన్నారు. బీజేపీ అమరావతి పాదయాత్ర కపట నాటకమని విమర్శించారు. ఒకే రాష్ట్రము-ఒకే రాజధాని..అదీ అమరావతి కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు.