అక్టోబర్ 5న తిరుపతి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. విజయ దశమి నుండి జిల్లా పర్యటనలకు పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పిఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.పవన్ పర్యటనపై జనసేన నేత, ఆయన సోదరుడు నాగబాబు కూడా స్పందించారు. తిరుపతి నుండి అక్టోబర్ న విప్లవం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు విజయదశమి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల యాత్రకు శ్రీకారం చుడుతున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యలయంలో, తెనాలిలో క్రియాశీల సభ్యులకు బీమా పత్రాలు, కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు 5న తిరుపతి నుంచి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యాత్ర మొదలవుతుందని తెలిపారు.
పవన్ ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, మన వ్యూహాలతో సన్నద్ధం కావాలని తెలిపారు. ‘‘జగన్ రెడ్డికి మరోసారి ఓటు వేయకూడదని రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి 70 శాతం ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల వచ్చిన సర్వేలో తేలింది. సంక్షేమ పథకాలు అతి కొద్దిమందికే అందుతున్నాయి.
వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. కార్యకర్తలపై పెరుగుతున్న దాడులు, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. వీరికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. జూలై నాటికి గ్రామ కమిటీలు, పట్టణ, వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. కష్టకాలంలో, ఎవరూ నమ్మని సమయంలో మీరంతా పార్టీకి అండగా నిలబడ్డారని.. ఈ దుర్మార్గ రాజకీయ వ్యవస్థలో మార్పే మన లక్ష్యమని చెప్పారు ‘కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టాం. జనసైనికులు అద్భుతంగా స్పందించారు. మనం నినాదాలకే పరిమితమైతే సరిపోదు. మన మిత్రులు, సన్నిహితులను పార్టీలోకి ఆహ్వానించాలి. ఈ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరం ఉంది. బయటకి వస్తే ప్రభుత్వంలో ఉన్న వారు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
జనసైనికుల కోసం అధినేత ప్రతి నియోజకవర్గం, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక అడ్వకేట్ అందుబాటులో ఉండేలా న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడి మీద చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దు. గతంలోనూ ఇలాంటి ప్రచారాలు చేశారు. ఇప్పుడు అమలాపురంలో అలాంటి కుట్రలు మొదలు పెట్టారు. అక్కడ జరిగింది ప్రభుత్వ కుట్ర. ఓట్ల కోసం సమాజంలో వర్గాలను చీల్చే కుట్రపన్నారు.
ముఖ్యమంత్రి మనసులో ఎలాంటి దురాశ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. జనసేన శ్రేణులు ప్రజా సమస్యల మీద మాత్రమే స్పందించండి. వ్యక్తిగతాలకు పోవద్దు’’ అని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జనసేన క్రియాశీల సభ్యత్వం మూడు లక్షలకు చేరిందని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త సుబ్రహ్మణ్యం భార్యకు రూ.5 లక్షల సాయాన్ని అందజేశారు.
ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనుకుంటున్న పవన్ కల్యాణ్.. తన రాజకీయ యాత్రను తిరుపతి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి పోటీ కూడా అక్కడి నుంచే చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
పవన్ టూర్ నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. తన పర్యటనలో పవన్ ఏయే అంశాలను లేవనెత్తుతారు…? ఎలా ప్రజలను జనసేనవైపు తిప్పుకోగలుగుతారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పవన్ పలు పర్యటనలు చేసినా.. అవి కేవలం రోజులకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఆరు నెలల పాటు ప్రజల్లో నే ఉండేలా ప్లాన్ చేసుకోవడంతో ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని పవన్ డిసైడయినట్లు తెలుస్తోంది. ఈ టూర్ తర్వాత రాష్ట్రంలో తమ బలాన్ని నిరూపించుకొని ఎన్నికలకు సన్నద్ధమవ్వాలనేది పవన్ భావిస్తున్నట్లు సమాచారం.