పవన్ కల్యాణ్ కు ఏ జ్వరం వచ్చిందో తెలియదు గాని.. చాలా రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. మొన్నటివరకు కౌలుభరోసా యాత్రలు, జనవాణి.. ఆ తర్వాత సోషల్ మీడియాలో రోడ్లు.. మద్యనిషేధం మీద వాయించిపారేసిన పవన్ కల్యాణ్.. కొన్ని రోజులుగా మౌనం పాటిస్తున్నారు. కీలక పరిణామాలు జరిగినా.. ఏమీ మాట్లాడటం లేదు. ఒకవైపు బిజెపి ట్రెండ్ మార్చి టీడీపీకి దగ్గరవుతుండటం.. మరోవైపు పవన్ మౌనానికి లింక్ ఉందా అని కొందరు ఆరా తీస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఛీల్చకుండా చూడాలని పిలుపు ఇచ్చిన పవన్.. ఆ తర్వాత ఒంటరిపోరుకు అయినా సిద్ధమేనని తేల్చి చెప్పారు. టీడీపీతో కలవడానికి, బిజెపి దూరమైనా పర్వాలేదన్నట్లే వ్యవహరించారు. అదే సమయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే టీడీపీని సైతం లెక్క చేయబోమని కూడా సంకేతాలు ఇచ్చారు.
అసలైతే జనసేనలో అంతర్గతంగా పొత్తులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి కాకపోతే ఇంకోసారి.. మనదేం పోయింది.. టీడీపీ దిగి వస్తేనే పొత్తు పెట్టుకుందామని చాలామంది వాదించారని తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం.. మన పొలిటికల్ కెరీర్ కోసం చూసుకుంటే.. అక్కడ రాష్ట్రం దారుణంగా నష్టపోతుంది.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఈ రౌడీ అరాచక పాలనను ముగించకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నించారంట. అందుకే అవసరమైతే తగ్గి అయినా సరే.. పొత్తుకు సిద్ధపడాలని తేల్చి చెప్పారంట. బిజెపితో సైతం ఇదే చెప్పారని.. మరోవైపు బిజెపి సర్వేల్లో కూడా వైసీపీ ఓటమి తప్పదని తేలడంతోనే.. ఆ పార్టీ తన రూటు మార్చుకుందని చెబుతున్నారు. వైసీపీ కోసం చూసుకుంటే ఇటు జనసేన కూడా దూరమయ్యే ప్రమాదం కనపడింది. అందుకే తమ స్ట్రాటజీ మార్చేశారు. తాము స్ట్రాటజీ మారుస్తున్నామని. అప్పటివరకు పవన్ ఏమీ అనకుండా ఉంటే బెటరని రిక్వెస్ట్ చేశారని సమాచారం.
అందుకే అవన్నీ తేలేవరకు పవన్ కాస్త సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు ముగ్గురూ కలిస్తే.. తమకు ఎన్ని సీట్లు తీసుకోవాలనేదానిపై కూడా క్లారిటీగా పవన్ ఉన్నారని అంటున్నారు. ముగ్గురూ కలవడానికి కారణం పవనే కాబట్టి.. పవన్ చెప్పింది వింటారని కూడా అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో సైతం పవన్ తో ఉపయోగం ఉంటుందనే ఆలోచనలో బిజెపి ఉంది. తెలంగాణలో అధికారంలో రావాలనే పట్టు మీదున్న బిజెపి ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అందుకే పవన్ కల్యాణ్ తో అన్ని విధాలా జాగ్రత్తగా వ్యవహరించాలని బిజెపి అనుకుంటుందని టాక్.
ఏమైనా పవన్ మాట్లాడినా ఎఫెక్టే.. మాట్లాడకపోయినా ఎఫెక్టే. ఆ మాత్రం ఎడ్జ్ ఉంది కాబట్టి.. పవన్ కొన్ని విషయాలు తేలిస్తే మంచిది. ఇప్పటికే రైల్వో జోన్ కు రంగం సిద్ధం చేసింది బిజెపి. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా.. స్టీల్ ప్లాంట్ ఇలాంటివాటిపైనా కేంద్రంతో ప్రకటనలు ఇప్పిస్తే.. ఈ ముగ్గురి పొత్తుకు ఉపయోగకరంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






