గోరంట్ల మాధవ్ ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారో.. ఆయనను మించి ఒక జర్నలిస్టు, టీవీ5లో డిబేట్లు నిర్వహించే సాంబశివరావు చేశాడు. గతంలోనూ ఒకసారి నోరుజారి సినిమావాళ్లపై బూతులు మాట్లాడిన ఈయన తర్వాత సారీ చెప్పాడు. అది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ నోరుజారారు. పైగా క్షమాపణలు చెబుతూనే అన్నారు. అంటే అది నోరు జారడం కాదనుకోవాలి.. కావాలనే అన్నారని అనిపిస్తోంది. మాధవ్ వీడియో కరెక్టో కాదో ఆయన ఫ్యామిలీకి చూపిస్తే వాళ్లు చెప్పేస్తారని ఆయన ఓ డైలాగ్ వేశారు. ఇది నిజంగా జర్నలిస్టుగా అనకూడని విషయం.. క్షమించరాని విషయం. అలా దిగజారి మాట్లాడితే గోరంట్ల మాధవ్ కు.. ఈయనకు తేడా ఏమున్నట్లు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే గోరంట్ల మాధవ్ పై మెజారిటీ ఏపీ ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అది ఎలాంటి అభిప్రాయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ప్రభుత్వం, పోలీసులు నడిపిన ప్రహసనం ఆయనకు మరింత డ్యామేజ్ చేసింది. ఆ వీడియో ఒరిజనలే అన్న అనుమానం మరింత పెరిగింది. ఇలాంటి పరిస్ధితుల్లో సాంబశివరావు ఇలా మాట్లాడటం చాలామందికి ఆగ్రహం కలిగించింది. బహుశా మాధవ్ మీద కోపంగా ఉన్నారు కాబట్టి తన డైలాగ్ పేలుతుందనో.. లేక వ్యూస్ విపరీతంగా వచ్చేస్తాయి.. రేటింగ్ పెరుగుతుందనో అలా సెన్సేషనల్ గా మాట్లాడటానికి ప్రయత్నించినట్లు కనపడుతోంది. కాని ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆయన క్రెడిబులిటీ మీద.. ఆయన జర్నలిస్ట్ ఎథిక్స్ మీద ఇది దెబ్బ కొట్టింది. ఆయనంటే గౌరవం ఉన్నవారు సైతం ఆయన చర్యను సమర్ధించలేకపోతున్నారు.
అంటే కెమెరా ముందు మాత్రమే మర్యాదగా మాట్లాడతారా.. కెమెరా లేకపోతే ఇలా బూతులే మాట్లాడతారా అనే అనుమానం ఆయన ప్రేక్షకుల్లో పెంచేశారు. కోట్లాదిమంది చూసే చానెల్లో ఇలా దిగజారి ప్రవర్తించడం ఏ మాత్రం మంచి పరిణామం కాదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆ చానెల్ కు తెలుగుదేశం చానెల్ అనే పేరుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దుష్టచతుష్టయంలో దీనికి స్థానం కూడా కల్పించి.. పదే పదే తిడుతున్నారు.
ఈ ఎపిసోడ్ మొదలయ్యాక.. గోరంట్ల మాధవ్ కూడా అదే పనిగా టీవీ5ను తిడుతున్నారు. అయినా అవన్నీ చానెల్ కు ప్లస్ అయ్యాయి. ఎటొచ్చీ సాంబశివరావు ఇలాంటి ఓవరాక్షన్ చేసినప్పుడే ప్లస్ మైనస్ గా మారుతుంది. ఇకనైనా సాంబశివరావు జాగ్రత్త తీసుకోవాలని.. ఇలాంటి అత్యుత్సాహం ఆయనకు తగదని ఆయన అభిమానులే హెచ్చరిస్తున్నారు.
