‘ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా’ పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా మలి విడత పర్యటనలు ప్రారంభిస్తున్నారు. మహానాడు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, జిల్లా మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చోడవరం చేరుకుంటారు. బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు శిలఫలకాన్ని సందర్శించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.
రాత్రికి స్థానిక కళ్యాణ మండపంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. 16వ తేదీ అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభి… అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రికి విశాఖ నగర పరిధిలోని గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, ఆనందపురం, తగరపువలస మీదుగా రోడ్డు షో ద్వారా విజయనగరం జిల్లా అమతం రాయవలస చేరుకుంటారు. 17వ తేదీన నెల్లిమెర్ల, రామతీర్థం జంక్షన్, గుర్ల, పెనుబర్తి జంక్షన్, తోటపల్లి కెనాల్, గరివిడి, చీపురుపల్లి గ్రామాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ… 26 జిల్లాల్లో ఏడాది పాటు విస్తృత పర్యటనలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఒక్కో పర్యటన మూడు రోజుల చొప్పున.. ప్రతినెలా మొదటి, చివరి వారాల్లో రెండేసి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రతీ జిల్లాలోనూ ఇదే తరహా ప్రణాళిక అనుసరించనున్నారు. ఏడాదిలో 100కు పైగా నియోజకవర్గాలను చుట్టేసేలా చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి. ఇప్పటినుంచే కార్యకర్తల్ని ఎన్నికలకు సంసిద్ధం చేయడంతోపాటు వివిధ ఛార్జీల పెంపు, పన్నుల భారంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పోరాడేందుకు ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగించాలని చంద్రబాబు నిశ్చయించారు.