గత కొంతకాలంగా జగన్ ఎమ్మెల్యే లతో మీటింగ్ పెట్టిన ప్రతిసారీ మీరు జనాల్లో ఉండాలి, పనితీరు బాగోపోతే ఈసారి టికెట్ కుదరదు అని చెప్పేశారు. దానికి తగ్గట్లుగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు దీనిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ జగన్ తెప్పించుకున్న సర్వే లో పనితీరు బాగొని ఎమ్మెల్యేల మీద చర్యలు మొదలు అయ్యాయి.
వైసీపీ ఎమ్మెల్యేల్లో తాడికొండ భయం పట్టుకుంది. తాడికొండలో అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ నియమించింది. ఈ నియామకాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తనను పక్కన పెట్టే కుట్రలో భాగంగా పార్టీ ఈ కార్యక్రమం చేపట్టిందని శ్రీదేవి ఆరోపణ.
ఈ నేపథ్యంలో సర్వే నివేదికల్లో బాగా నెగెటివ్ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తాడికొండ పరిణామాల దృష్ట్యా తమను ఎక్కడ పక్కన పెడతారో అని వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ మొదలైంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాల పార్టీ అధ్యక్షులను పిలిపించుకుని వాళ్ల పరిధిలోని ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్, వివిధ సంస్థల సర్వే నివేదికల గురించి చెబుతున్నట్టు సమాచారం.
నియోజక వర్గ ఎమ్మెల్యే పనితీరు మెరుగుపరచుకోవాలని చెబుతూ నిర్దేశిత సమయం ఇస్తున్నారని తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు హడలెత్తి పోతున్నారు. తిరుపతి జిల్లాలో కొంత మంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ తీవ్ర అసహనంగా ఉన్నారని తెలిసింది. పనితీరు మార్చుకోవాలని సంబంధిత ఎమ్మెల్యేలకు హెచ్చరికలు వెళ్లాయని టాక్.దీంతో తమకు వైసీపీలో నూకలు చెల్లుతాయోమో అనే భయం ఆ ఎమ్మెల్యేల్లో ఉంది. తాడికొండ ఉదంతాన్ని చూపుతూ, బాగా చేసుకోకపోతే, అదే గతి పడుతుందని వైసీపీ పెద్దలు హెచ్చరిస్తున్నారని తెలిసింది.