వైసీపీ ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్ ప్రచారం తప్ప రాష్ట్రంలో కనీసం రహదారులను పట్టించుకోవడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం రహదారుల ఉద్యమ పోస్టర్‌ని నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 22వేల కోట్లు రహదారుల కోసం కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొందన్నారు. 2వేల కోట్లతో రహదారులు మరమ్మత్తులు చేస్తామని సీఎం జగన్‌రెడ్డి చెప్పారన్నారు. జూలై 15వ తేదీలోగా రహదారులు బాగు చేయాలని చెప్పినా మార్పు లేదని చెప్పారు. ఏపీలో రహదారుల దుస్థితిపై జనసేన గతంలో ఉద్యమం చేపట్టిందన్నారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారన్నారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చిన ఘనత వైసీపీ సర్కారుదేనని చెప్పారు. రోడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన సవాల్‌ను జనసేన స్వీకరిస్తుందని చెప్పారు. పార్టీ తరపున డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారన్నారు.జూలై 15వ తేదీ నుంచి సోషల్ మీడియా వేదికగా జనసైనికులు ఉద్యమిస్తారన్నారు.అధ్వానంగా ఉన్న రోడ్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు జనసేన కార్యకర్తలు డిజిటల్ క్యాంపెయిన్‌లో పాల్గొంటారని చెప్పారు. ‘‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’’ హ్యాష్ ట్యాగ్‌తో ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారని అన్నారు. రహదారి సెస్ పేరిట ఏటా ప్రభుత్వం 750 కోట్లు వసూలు చేస్తుందని మండిపడ్డారు. సెస్ చూపించి సీఎం జగన్‌రెడ్డి 6వేల కోట్లు బ్యాంకు రుణాలు తెచ్చారన్నారు.మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.