నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో రోజు ప్రశ్నించనుంది. దీంతో ఢిల్లీలో రెండోరోజూ హైటెన్షన్ కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిన్న ప్రశ్నించిన ఈడీ.. ఇవాళ కూడా రమ్మని కోరింది. దీంతో ఆయన ఇవాళ కూడా విచారణకు హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు హాజరైన రాహుల్.. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు రాహుల్కు సంఘీభావం తెలిపారు.ముఖ్యనేతలనే ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఇతర కాంగ్రెస్ నేతలను లోనికి వెళ్లనియకుండా అడ్డుకున్నారు. అదేసమయంలో, మాన్ సింగ్ రోడ్ సర్కిల్పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఆందోళన చేస్తున్న కొంతమంది కాంగ్రెస్ ఎంపీలను దిల్లీ పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాను సైతం అదుపులోకి తీసుకున్నారు.
తొలిరోజు విచారణలో రాహుల్ గాంధీపై దాదాపు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు.. ఇవాళ రెండోరోజు కూడా నేషనల్ హెరాల్డ్ కేసుపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.అయితే తొలిరోజు రాహుల్ ఇచ్చిన సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో రోజు విచారణ కీలకంగా మారింది. అయితే ఇవాళ కూడా రాహుల్ అదే వైఖరి ప్రదర్శిస్తే ఈడీ తీసుబోబోయే చర్యలపై ఆసక్తి నెలకొంది. దీంతో ఇవాళ రాహుల్ విచారణ ముగిసేవరకూ ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగే అవకాశముంది
ట్రాఫిక్ జామ్ నియంత్రణకు ఏర్పాట్లు
రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దిల్లీ లుటియన్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నివారించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ, ఈడీ కార్యాలయాలకు వెళ్లే దాదాపు అన్ని మార్గాలను పోలీసులు మూసేశారు. కాంగ్రెస్ శ్రేణుల నిరసనలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, రెండో రోజు అలాంటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత ట్రాఫిక్ సాధారణంగా సాగేందుకు పలు మార్గాల్లో వాహనాలను అనుమతించనున్నట్లు వెల్లడించారు.ఆ రూట్లు బంద్
ప్రస్తుతం అక్బర్ రోడ్, జనపథ్ రోడ్, అబ్దుల్ కలాం మార్గ్, పృథ్వీరాజ్ రోడ్డు, మోతీలాల్ నెహ్రూ మార్గ్, సునేహ్రీ బాగ్ మార్గాలను పోలీసులు మూసేశారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆందోళన కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో పోలీసులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ విధించినప్పటికీ.. ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
ఇదీ కేసు
కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.
ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా తదితరులు ఉన్నారు.