అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఉదయం కర్ణాటకలోని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ‘‘యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది, ఇది మన ప్రపంచానికి శాంతిని తెస్తుంది, యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీతో పాటు 15 వేల మందికి పైగా యోగా అభ్యాసకులు వేడుకల్లో పాల్గొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యోగాను గుర్తించిన ఐరాస సహా ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందన్నారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని, జీవన విశ్వాసం ఇస్తుందని మోదీ పేర్కొన్నారు.
కర్ణాటకలో ‘మోదీ’ ఆసనాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజాము నుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(యోగా ఫర్ హ్యుమానిటీ) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉపరాష్ట్రపతి
నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా యూనిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యాన్నిస్తుందని తెలిపారు. ప్రస్తుత జనరేషన్ కూడా యోగాను చేయాలని అన్నారు. యోగా అంటే ఇంద్రియాలను ఏకం చేయడం, ఆత్మశక్తిని ఏకం చేయడం అని చెప్పుకొచ్చారు. యోగా ప్రాచీనమైనదే అయినా దోషం పట్టనిదన్నారు. యోగాకు కులం, మతం, బ్యారియర్స్ లేవని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను పాపులర్ చేసినందుకు ప్రధాని మోదీకి, యోగాను కనుగొన్న మన పూర్వీకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారని, ఆరోగ్యం ఉంటే భాగ్యం సాధ్యమవుతుందని అన్నారు. ప్రాశ్చాత్య వ్యామోహంతో వచ్చిన మార్పులతో యోగా విశిష్టత మరింత పెరిగిందన్నారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్య వంతం చేద్దామని, యోగా సాధనతో ప్రపంచ శాంతి చేకూర్చుకుందామని పిలుపునిచ్చారు. యోగా స్ట్రెస్, టెన్షన్‌ను పోగొడుతుందన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి యోగా మహోత్సవ్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పిస్తూ మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహి స్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం జరిగే యోగా దినోత్సవఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రధాని నుంచి సర్పంచ్ వరకు యోగా వేడుకల్లో పాల్గొంటారన్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగే యోగా వేడుకల్లో ప్రధాని మోదీ, కోయంబత్తూర్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఘన చరిత్ర కలిగిన 75 వారసత్వ కట్టడాల వద్ద జరిగే వేడుకల్లో కేంద్ర మం త్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమయ్యే యోగా వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశంలో 75 వేల చోట్ల యోగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తెలిపారు. మైసూరు ప్యాలె్‌సలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 1000 మంది స్కూలు విద్యార్థులతో కలిసి 45 నిమిషాలపాటు 20 యోగాసనాలు వేస్తారు. ఈ కార్యక్రమానికి 15 వేల మంది హాజరవుతారని అంచనా. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ థీమ్‌తో ఈసారి యోగా డే జరగనుంది.
తెలంగాణ ఆఫీస్‌లో ఘనంగా యోగా దినోత్సవం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75 వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఎవరో ఒకరు ఏదైనా అంశానికి సంబంధించి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తే తప్ప సమాజం పాటించే పరిస్థతి లేదని అన్నారు. యోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతో పాటు మరో పది మందితో యోగా చేసేలా కృషి చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
పీవీ సింధు, అడవి శేషు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్టార్ షట్లర్ పీవీ సింధు, నటుడు అడవి శేషు, ఈటల, పొంగులేటి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ యోగా దినోత్సవానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి రోజూ యోగాను ప్రాక్టీసు చేస్తేనే ఫలితం ఉంటోందని తెలిపారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తున్నారు. ఎంత బిజీలో ఉన్నా రోజూ 30 నిమిషాలు యోగా చేయటం అలవాటు చేసుకోవాలని పీవీ సింధు సూచించారు.
యోగా నిత్య జీవితంలో భాగమైంది : మంత్రి హరీష్ రావు
యోగా నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతమంది రోగాలు పడ్డాక యోగా చేద్దామని అనుకుంటున్నారని అలా కాకుండా నిత్యం యోగా చేయడం వాళ్ళ పూర్తి ఆయుష్‌తో నిండు నూరేళ్లు బతుకుతున్నారన్నారు. కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నింటికి పరిష్కారం యోగా అని చెప్పుకొచ్చారు. సెల్‌ఫోన్ చూడటానికి సమయం ఉంటుంది కానీ, యోగా చేయడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజల కోసం కోమటి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రపంచం మొత్తం భారత్ దేశం వైపు చూస్తోందన్నారు. ఇంకా కొత్తకొత్త ఆసనాలు తయారుచేయాలని కోరారు. అన్ని ఆస్పత్రులలో గర్భిణిల చేత యోగా ఆసనాలు చేయిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు సిజె.మిశ్రా
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ మైసూరు పాలెస్ నుండి ఇచ్చిన సందేశాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు, సభ్యులు మరియు హైకోర్టు సిబ్బంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. యోగా మాస్టర్ బి.మల్లికార్జునరావు నేతృత్వంలో వారి సూచనలకు అనుగుణంగా యోగాభ్యాసాలను వీరంతా ఆచరించారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ విశ్వమానవాళికి భారతదేశం అందించిన గొప్ప అభ్యసనాలు యోగాసనాలు అని కొనియాడారు. “యోగా ఫర్ హ్యుమానిటీ” అనే థీమ్ తో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. నిత్య నూతనోత్సాహాన్ని, శక్తిని కలిగించే యోగాసనాలను ప్రతి ఒక్కరు నిత్యం ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.
యోగా అంటే ఒక ఫిలాసఫీ : మంత్రి విడదల రజనీ
యోగా అంటే ఒక ఫిలాసఫీ, పాజిటివ్ థింకింగ్‌ని అలవరుస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న యోగా క్యాంప్‌కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రజనీ మాట్లాడుతూ చాలామంది విదేశీయులు ఇండియాకు యోగా నేర్చుకోవడం కోసం వస్తుంటారని అన్నారు. భారత దేశం గొప్పతనం, మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారన్నారు. ఈ వత్తిడి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా చెయాలని మంత్రి విడదల రజనీ తెలిపారు.
యోగా మూలాలు ఎక్కడంటే
యోగా మూలాలు 5000 ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశంలో కనిపెట్టారు. యోగా అనే పదం మొదట రుగ్వేదంలో ప్రస్తావించినట్టు చెబతారు. రుగ్వేదం వేదాలలో అతి ప్రాచీనమైనది. ఎంతో రుషులు పూర్వకాలంలో యోగా ద్వారానే ఎక్కువ కాలం జీవించే వారని అంటారు. వారే యోగాను మరింత అభివృద్ధి చేశారు. యోగా అనేది హిందూ, బౌద్ధమతాలలో ఎంతో గౌరవాన్ని పొందాయి. యోగాకు అంకితం చేసిన ‘శ్రీ యోగేంద్ర మ్యూజియం ఆఫ్ క్లాసికల్ యోగా’ను సందర్శిస్తే యోగా చరిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం ముంబైలో ఉంది. యోగాలో చాలా పదాలు పలకడానికే కొత్తగా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ సంస్కృతం నుంచి ఉద్భవించినవి. అనేక భారతీయ భాషలకు మూలం సంస్కృతమే. యోగా పితామహుడిగా పతంజలి మహర్షిని చెప్పుకుంటారు.ఎందుకంటే ఆయన యోగాకు సంబంధించిన శ్లోకాలను ఒక నిర్ధిష్ణ పద్ధతిలో క్రోడీకరించాడు. దాదాపు 196 శ్లోకాలు లేదా సూత్రాల సమాహారం యోగా శాస్త్రం. ఇందులోనే ఎన్నో ఆసనాల గురించి వివరించారు.
ఆదియోగి సృష్టి
భూమిపై యోగాను పరిచయం చేసింది ఆదియోగి అని చెబుతారు. ఆదియోగి ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే. అతడిని మనం దేవుడిగా పూజిస్తున్నాం. కానీ అప్పట్లో కొంతమంది ఆయన్ను మానవుడిగానే భావించే వారు. కాకపోతే ఆయన భౌతిక ప్రపంచం పరిమితులను దాటి ఎదిగిన మానవుడిగా చెబుతారు. రాముడు, కృష్ణుడు ఎలా మానవరూపంలో సంచరించారో, శివుడు కూడా ఆదియోగిగా భూమిపై సంచరించారని కొందరి నమ్మకం.
యోగా అంటే
యోగా అనే పదం సంస్కృత మూలం ‘యుజ్’ నుండి ఉద్భవించింది. దీని అర్థం ‘ ఒక దగ్గరికి చేర్చడం’ లేదా ‘ఏకం చేయడం’ అని. యోగ గ్రంథాల ప్రకారం యోగాభ్యాసం ఒక మనిషి వ్యక్తిగత స్పృహను, సామాజిక స్పృహతో ఏకం చేస్తుంది. మనస్సు, శరీరం మధ్య సంపూర్ణ ఏకత్వాన్ని అందిస్తుంది.
యోగా ఎందుకు చేయాలి ? దీని వల్ల మనకొచ్చే లాభం ఏంటి..?
యోగాతో శరీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యంగా కూడా బేషుగ్గా ఉంటుంది. ఇది శరీరాన్ని, మనస్సును ఆధ్యాత్మిక స్థితిని తీసుకువెళుతుంది. యోగా శరీరాన్ని, మనస్సును పునరుజ్జీవింపజేస్తుంది. యోగా చేయడం వల్ల హేతుబద్ధత, భావోద్వేగం, సృజనాత్మకత, పెరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అంతర్భాగం కావాలని నిపుణులు చెబుుతున్నారు. దీని వల్ల ఎన్నోప్రయోజనాలు పొందవచ్చు.
యోగా అంటే ఏమిటి?
యోగా అనే పదం సంస్కృత పదమైన యుజ్ నుంచి ఉద్భవించింది. యుజ్ అంటే జోడించడం లేదా ఏకాగ్రత పెట్టడం అని అర్థం. అందుకే యోగా అనేది మనస్సును ఏకాగ్రతపై కేంద్రీకరించే చర్య. విలువైన యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది పతంజలి మహర్షి. యోగ సాధన సంకుచిత అహంతో నిండిన వ్యక్తిత్వాన్ని విస్తృతం చేస్తుంది. ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. మనల్ని మనం శారీరకంగా చురుకుగా ఉంచుకోవడమే కాకుండా ఇది నిరాశకు, మానసిక సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. అందుకే యోగాను చిత్తవృత్తి నిరోధః అంటారు. అంటే మనసును నియంత్రించే కళ అని అర్థం. యోగా పరిధి విస్తారమైనది. యోగా అంటే కేవలం ఆసనాలు లేదా ప్రాణాయామాలు మాత్రమే కాదు. భారతదేశానికి చెందిన ప్రాచీన భారతదేశంలోని ఋషులు ప్రపంచానికి ఇచ్చిన జ్ఞానం ఇది. యమ, నియమ, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యహర, ధారణ, ధ్యానం,సమాధి అనేవి అష్టాంగ యోగాలు.
యోగా ప్రధాన రకాలు
చంచలమైన మనస్సును నియంత్రించడానికి, ఏకాగ్రతను తీసుకురావడానికి యోగా సహాయపడుతుంది. యోగాలో ప్రధానంగా ప్రాణాయామం, ఆసనాలు, వ్యాయామాలు ఉంటాయి.
ప్రాణాయామం : దీని అర్థం ప్రాణాన్ని నియంత్రించడం లేదా శ్వాసించడం. యోగాలో ప్రాణాయామం అంటే శ్వాసపై నియంత్రణ పొందడం అని అర్థం. ప్రాణాయామం ప్రధాన ఉద్దేశ్యం ఏకాగ్రతను సాధించడం. శ్వాసపై నియంత్రణ పొందడం ద్వారా మనస్సు చంచలతను నియంత్రించొచ్చు. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక ఆరోగ్యం కోసం ప్రాణాయామం చేసినట్లే శారీరక ఆరోగ్యం, ఫిట్ నెస్ కోసం ఆసనాలు వేస్తారు. మఖ్యంగా ఎక్కువ సేపు కూర్చునే సామర్థ్యం వ్యాయామాల్లో భాగం. ఆసనాలు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. శారీరక వ్యాయామాలతో పోలిస్తే శరీరాన్ని వివిధ భంగిమల్లో ఉంచడం వల్ల అవగాహన, వినడం, ఏకాగ్రత అభివృద్ధి చెందుతాయి. ఆసనాలు శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి.
వ్యాయామాలు
వ్యాయామాలు, యోగా యొక్క మరొక భాగం. శారీరక దృఢత్వం, ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే శారీరక శ్రమే వ్యాయామాలు. ఇది కండరాలను, హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే వ్యాయామాలు, నిద్రలేమి వంటి సమస్యను దూరం చేస్తాయి.
యోగా ప్రయోజనాలు
యోగా ఒత్తిడితో జీవితం నుంచి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు, యోగా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఏకాగ్రత పెరగడం
ప్రాణాయామం, వేరే ఆసనాలు చేసేటప్పుడు శ్వాసపై నియంత్రణను సాధించవచ్చు. కాబట్టి ఇది ఏకాగ్రతను మరింత పెంచుతుంది. యోగాలో ధ్యానం అనేది ఒక పరిస్థితి కాబట్టి, ఇది మానసిక స్పష్టతను పెంచుతుంది.
బరువు నియంత్రణ
యోగా బరువు తగ్గడానికి ప్రత్యేకంగా సహాయపడదు. కానీ శరీరం పై అవగాహన పెంచడానికి సహాయపడుతుంది. సరైన భంగిమలను ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రేగు రవాణా మెరుగుపడుతుంది. స్థిరమైన ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరానికి ఆహారం, వ్యాయామం ఎలా అయితే అవసరమో.. విశ్రాంతి కూడా అంతే అవసరం. అనేక యోగాసనాలు శరీరానికి, మనస్సుకు అవసరమైన విశ్రాంతిని అందిస్తాయి. చాలా భంగిమలు నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ధ్యానం ద్వారా రోజువారీ చింతలను అధిగమించవచ్చు.
శ్వాసను మెరుగుపరుస్తుంది
ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసపై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అందువల్ల యోగా అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలదు.
ఒత్తిడి నుంచి ఉపశమనం
ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒత్తిడి ఒకటి. యోగా దీనికి చక్కటి పరిష్కారం. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా మీరు అన్ని ఉద్రిక్తతలను వదిలించుకోవచ్చు. అలాగే ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చు.