రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను.
1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైయస్ఆర్‌సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం వైయస్ జగన్‌మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు.అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారిపోతే, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు.
డీఎస్సీ-98 నియామకాల ప్రకటన ఈయన జీవితాన్నే మార్చేసింది
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు మాస్టార్ స్టైల్ మారింది. నిన్నటి ఆదివారం చినిగిపోయిన దుస్తులతో కనిపించిన ఆయన.. జీన్స్ ప్యాంట్, టీషర్ట్‌తో హుందాగా కనిపించారు. 1998 డీఎస్సీలో క్వాలిఫై జాబితాలో ఉన్న ఆయనకు 55 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చింది. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. 1998 డీఎస్సీ వివాదాలతో నిలిచిపోయింది. దీంతో ఆయన కొద్దిరోజులు సైకిల్ మీద చేనేత వస్త్రాలు విక్రయించారు. ఆతర్వాత భిక్షాటన చేస్తూ కడుపు నింపుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ-1998 క్వాలిఫై జాబితాలో కేదారేశ్వరరావు పేరు ఉంది. దీంతో మాస్టారుకు ఓ వస్త్ర దుఖాన యజమాని దుస్తులు, సెల్‌ఫోన్ ఇచ్చారు. దీంతో సోమవారం కేదారేశ్వరరావు మాస్టారు స్టైల్ మారిపోయింది. గ్రామ యువకులు ఆయనకు సన్మానం చేశారు.