ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి ఆహ్వానం పంపారు.దీంతో ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భీమవరం సభకు తాను వస్తానని ఈ సందర్బంగా చిరంజీవి కిషన్ రెడ్డితో చెప్పినట్లు తెలిసింది. చిరంజీవి సొంత జిల్లా కావడంతో ఆయనకు ప్రత్యేక ఆహ్వానాన్ని కిషన్ రెడ్డి అందించారు.
ఈ సంవత్సరం జూలై 4, 2022న దేశం శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని జరుపుకోనుంది. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో “మన్యం వీరుడు” గా గౌరవించబడతారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, వలస శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మద్రాసు ప్రెసిడెన్సీలోని గిరిజన సంఘాలను ఏకం చేయడంలో మరియు శిక్షణ ఇవ్వడంలో అల్లూరి సీతారామరాజు చేసిన కృషిని గుర్తించే అవకాశం మనకు ఉంది. దీనికి సంబంధించి జూలై 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం రానున్నారు. ఈ షెడ్యూల్‌లో పెదమిరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగం మరియు భీమవరం ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ప్రధాని కార్యక్రమంలో భాగంగా జూలై 4న భీమవరంలో జరిగే కార్యక్రమానికి మీరు హాజరుకావాలని కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు గౌరవార్థం వచ్చే ఒక సంవత్సరంలో అంటే జూలై 4, 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వివిధ కార్యక్రమాలను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో మీ మద్దతు మరియు సహకారాన్ని కోరుతున్నాను” అని నటుడు చిరంజీవికి పంపిన ఆహ్వానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే ఇప్పటివరకు చిరంజీవి ఎప్పుడూ మోడీని కలిసింది లేదు. పలుసార్లు ఆయన మోదీతో భేటీ అవుతారని వార్తలు వచ్చినా అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ఇప్పుడు మోదీతో నేరుగా చిరంజీవి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజికీయాల్లో ఉన్నది తెలిసిందే. దీంతో పవన్ ఇప్పటికే మోదీని కలిశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కోడలు…రాం చరణ్ సతీమణి ప్రధానితో సమావేశం అయ్యారు. వ్యాపార- సేవా రంగాల్లో ప్రముఖంగా నిలుస్తున్న ఉపాసన గతంతో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ప్రస్తావించిన అంశాలతో జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించారు.