రక్షణ దళాల్లో చేరి దేశానికి స్వల్ప కాలం పాటు యువత సేవలు అందించేందుకు వీలుగా రక్షణ శాఖ ఒక చక్కని అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘భారత్ కే అగ్నివీర్ పేరు’తో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో నాలుగేళ్ల పాటు సేవలు అందించే స్వల్పకాల పథకం ఇది. దీని వివరాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిద దళాల అధిపతులతో కలసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అగ్నిపథ్ పథకాన్ని ఆమోదిస్తూ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
సాయుధ దళాలకు యువ రూపాన్ని కల్పించేందుకు ఈ పథకం కింద చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి చెప్పారు. యువతకు కొత్త సాంకేతికతలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. వివిధ రంగాల్లో భిన్న నైపుణ్యాలున్న వారికి ఈ పథకం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు.
‘‘అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయి. 17.5 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారిని చేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఒక్కసారి ఎంపికైతే అగ్నివీర్స్ నాలుగేళ్లపాటు సేవలు అందిస్తారు’’ అని సైనిక దళాల అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి తెలిపారు.
ఈ పథకం కింద యువతీ, యువకులకు సైనిక దళాల్లో చేరే అర్హత ఉంటుంది. వయసు 17.5-21 మధ్య ఉండాలి. ప్రస్తుతం సైనిక దళాల్లో చేరేందుకు ఉన్న శారీరక సామర్థ్యం, వైద్య అర్హతలే వర్తిస్తాయి. 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారిని తీసుకుంటారు. అగ్నివీర్స్ కు ఏటా 4.76 లక్షలు మొదటి ఏడాది చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి రూ.6.92 లక్షలు చెల్లిస్తారు.
పలురకాల అలవెన్స్ లు కూడా లభిస్తాయి. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత రూ.11.7 లక్షలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై పన్ను ఉండదు.
నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ కేడర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాలు, అర్హతలను బట్టి 25 శాతం మందిని తీసుకుంటారు.
ఏమిటి ఈ అగ్నిపథ్ స్కీమ్ ?
నాలుగేళ్ల పాటు యువతను భారత త్రివిధ దళాల్లో జాయిన్ చేసుకోవడమే ఈ అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఉద్యోగం కొనసాగిస్తున్న సమయంలో అగ్ని వీర్లకు ఆకర్షణీర్షయమైన జీతం లభిస్తుంది. నాలుగు సంవత్సరాల తరువాత ప్యాకేజీ రూపంలో నగదును అందజేస్తారు. అయితే ఇందులో పని చేసి వచ్చిన వారికి వివిధ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తారు.
కేరళ సీఎం పినరయి విజయన్ కు విమానంలో నిరసన సెగ..
ఈ పథకం కింద రిక్రూట్ అయిన చాలా మంది సైనికులు నాలుగేళ్ల తర్వా త విముక్తి పొందుతారు. కొంత మందిని మాత్రం కొనసాగిస్తారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువతకు ఇందులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి 10 వారాల నుండి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. దీని కోసం విద్యార్హత పది లేదా ఇంటర్ మీడియట్ గా నిర్ణయించారు. 90 రోజులలో అగ్నివీర్ల మొదటి రిక్రూట్మెంట్ ఉండనుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఉండదు. పెన్షన్ కు సంబంధించిన ప్యాకేజ్ మొత్తం ఒకేసారి అందిస్తారు. సైన్యంలోని ఏ రెజిమెంట్లోనూ కులం, మతం, ప్రాంతం ఆధారంగా రిక్రూట్మెంట్ ఉండదు.
జీతం ఎంత వరకు ఉంటుంది ?
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ కింద ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజిని అందిస్తారు. అది నాలుగో సంవత్సరం నాటికి 6.92 లక్షలకు పెరగనుంది. ఇది కాకుండా రిస్క్ అలవెన్సులు, ఇతర అలవెన్సులు అందజేస్తారు. నాలుగేళ్ల సర్వీసు ముగిసిన తర్వాత యవతకు రూ.11.7 లక్షలను సేవా నిధి రూపంలో అందజేస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఉపయోగాలు..
దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తి ఉన్న యువతకు అగ్నిపథ్ స్కీమ్ మంచి అవకాశంగా మారనుంది. స్వల్ప కాలం సేవలందించి తరువాత ఇతర ఉద్యోగాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాగే త్రివధ దళాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల సైన్యా నికి కోట్లాది రూపాయిలు ఖర్చు ఆదాకానుంది. నాలుగేళ్ల తరువాత కూడా కొనసాగే కొద్ది మంది అగ్నివీర్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు జీతంలో కూడా పొదుపు కానుంది. కాగా ఇటీవలే త్రివిధ దళాల అధిపతులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, ఈ రిక్రూట్ మెంట్ స్కీమ్ ను వివరించారు.