రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రచించిన “మహా సంగ్రామర్ మహా నాయక్” అనే ఒడియా నాటకాన్ని ఈ నెల 17 న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సి.ఎస్.రజత్ భార్గవ తెలిపారు. అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాది కా అమ్రిత్ మహోత్సవాల్లో భాగంగా ఈ ఒడియా నాటకాన్ని ప్రభుత్వ పరంగా ప్రదర్శిచండం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం మరియు 1976 నుండి నాటకాల ప్రదర్శనలో మంచి అనుభవం ఉన్న అభినయ థియేటర్ ట్రస్టు సంయుక్త ఆద్వర్యంలో ఈ నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సమాజానికి చక్కని సందేశాలను అందజేస్తూ రాష్ట్ర గవర్నర్ తొమ్మిది నాటకాలను రచించారని, ఆ నాటకాలను అన్నింటినీ పలుచోట్ల ప్రదర్శించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో బ్రిటీష్ పాలనలో ఎదురైన కొన్ని సమస్యలను ఏవిధంగా అధిక మించడం జరిగిందో చక్కగా వివరిస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ “మహా సంగ్రామర్ మహా నాయక్” అనే ఒడియా నాటకాన్ని చక్కగా రచించారని ఆయన తెలిపారు. ఈ నాటకాన్ని ఈ నెల 17 వ తేదీ ఆదివారం సాయంత్రం 6.00 గంటల నుండి తుమ్మలపల్లి క్షేత్ర్రయ్య కళా క్షేత్రంలో ప్రదర్శించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నాటక ప్రదర్శనకు అందరూ ఆహ్వనితులే అని, ప్రజలు పెద్దఎత్తున ఈ నాటక ప్రదర్శనకు విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆజాది కా అమ్రిత్ మహోత్సవాలు 2023 వరకూ జరుగుతాయి
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలం నుండి ఆజాది కా అమ్రిత్ మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నదని, ఆ మహాత్సవాలు 2023 వరకూ జరుగుతాయని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సమయోదులు, భారత దేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడంతో మన రాష్ట్రంలో ఈ మహోత్సవాలు ప్రారంభం అయ్యాయన్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోది గుజరాత్ లో సబర్మతీ యాత్ర చేయడం జరిగిందని, భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రారంభించారున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగానే ఈ ఒడియా నాటక ప్రదర్శనను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు .