హైదరాబాద్ మాదాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ముజాహిద్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అతణ్ని కాపాడటానికి మధ్యలో వచ్చిన జహంగీర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇస్మాయిల్ అనుచరులు అతన్ని, జహంగిర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఇస్మాయిల్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గాయపడిన జహంగిర్‌కు చికిత్స చేశారు. కాల్పుల సమాచారం అందుకుని ఘటన స్థలానికి బాలానగర్ డీసీపీ సందీప్ చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న క్లూస్ నిపుణులు, జాగిలాల బృందం చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
‘పాతబస్తీకి చెందిన రౌడీషీటర్లు ఇస్మాయిల్, ముజాహిద్ అలియాస్ ముజ్జుకు గతంలో జైలులో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇద్దరు రౌడీషీటర్లు కలిసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో 250 గజాల స్థలంకు సంబంధించి వీరి మధ్య వివాదం ఏర్పడింది. గతంలో పలుమార్లు ఇరువురు స్థల వివాదానికి సంబంధించి సమావేశమై చర్చించుకున్నారు. అయితే మరోసారి మాట్లాడుకుందామని ఇద్దరు తమ అనుచరులతో కలిసి వేర్వేరుగా మాదాపూర్ నీరూస్ వద్దకు చేరుకున్నారు.’ అని డీసీపీ సందీప్ రావు వెల్లడించారు.ఈ క్రమంలోనే ముజాహిద్, ముజాహిద్ రైట్ హ్యాండ్ జిలానీ కలసి ఇస్మాయిల్ పై రెండు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం జిలానీ ఒక్కడే ఒక నాటు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఎన్ని రౌండ్లు కాల్పులు జరిగాయి…ఎన్ని తుపాకులు ఇందుకోసం వాడారు అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాల్పుల సమయంలో ఇస్మాయిల్ అనుచరుడు జహంగీర్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతను గాయాలపాలయ్యాడు.
ఇస్మాయిల్ కుప్పకూలడంతో ముజాహిద్ అతని అనుచరులు అక్కడ నుంచి పరారయ్యారు.అయితే రౌడీ షీటర్ల మధ్య కాల్పులకు కారణం భూవివాదమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా, వారి నేర చరిత్ర ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ముజాహిద్ అతని అనుచరులు సంగారెడ్డి, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్టు బాలానగర్ డీసీపీ సందీప్ తెలిపారు. ఇస్మాయిల్ పై జహంగిర్ మూడు రౌండ్లు కాల్పులు జరిపిట్టు ఆయన చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.