వ్యవసాయాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు రైతులకు కావాల్సిన అధునాతన పనిముట్లు అందుబాటులోకి తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ‘వైఎస్సార్ యంత్ర సేవ పథకం’ రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్ని రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. అందరిని అశ్చర్యపరిచారు. అనంతరం 1,140 వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్ యంత్రసేవ కేంద్రాలకు 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ ప్రారంభించిన .. 5,260 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61కోట్ల సబ్సిడీని సీఎం వైయస్ జగన్ జమ చేశారు.
‘‘విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతన్నకు ప్రభుత్వంగా తోడుగా నిలిచింది. విత్తనాల సప్లయి నుంచి పంట కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అండగా నిలబడుతూ వస్తున్నాం’’ అన్నారు. . రాష్ట్ర వ్యాప్తంగా 10,750 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయం ఇంకా మెరుగు పరిచేందుకు రైతులకు కావాల్సిన పనిముట్లు ఆ రైతు భరోసా కేంద్రాల్లో అదే గ్రామంలోనే తక్కువ రేటుకు అందుబాటులోకి వచ్చేట్టుగా రైతులతోనే గ్రూపులు ఫామ్‌చేశాం. రైతులకు ప్రభుత్వం సబ్సిడీ 40 శాతం ఇచ్చి.. మరో 50 శాతం తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి.. కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు వారికి గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా వస్తువులన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
ఈరోజు అక్షరాల రూ.2,016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్థాయిలో 15 లక్షల విలువగల 10,750 వైయస్‌ఆర్ యంత్రసేవా కేంద్రాలను స్థాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా వరి ఎక్కువ పండించే 20 జిల్లాల్లో ఒకొక్కటి 25 లక్షల విలువగల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకే కేంద్రాల్లోకి ట్రాక్టర్లు విస్తరిస్తాయి. అందులో భాగంగా 3,800 ట్రాక్టర్లు అందిస్తున్నాం. వీటితో పాటు 1,140 ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా ఈరోజు అందిస్తున్నాం. క్లస్టర్ స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కూడా ఈ రోజు జరుగుతుంది. 5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి 590 కోట్ల రూపాయలు విలువ చేసే సామగ్రితో ఈరోజు 175 కోట్ల రూపాయల సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ కలిపి ఇప్పటికీ 6,780 ఆర్బీకేల్లోకి, మరో 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్లు విలువ చేసే ట్రాక్టర్లు, కంబైన్డ్lహార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసినట్టు అవుతుంది.
ఏడాదిలోపే అక్షరాల 2,016 కోట్లు విలువ చేసే సామగ్రి రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం. ఇవన్నీ దేవుడి చల్లని దీవెనలు, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైంది. ఇంకా ఎక్కువ మంచిచేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటూ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
గతంలో చంద్రబాబు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులకు ఎవరూ కూడా వారికి నచ్చిన ట్రాక్టర్ ఆర్డర్ చేయలేదు. చంద్రబాబు, ఆయన మంత్రులు, తాబేదారులే ట్రాక్టర్ల డీలర్లతో మాట్లాడుకొని ఏ విధంగా స్కామ్‌లు చేశారో చూశాం. అప్పటికి.. ఇప్పటికి తేడా గమనించండి. ఈరోజు ఏ పనిముటు కావాలన్నా.. నేరుగా రైతు ఇష్టానికే వదిలేశాం. నచ్చిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చే వెసులుబాటు, స్వేచ్ఛ రైతుకు కల్పించాం. సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. తేడా గమనించమని అడుగుతున్నా.. అవినీతి లేకుండా వ్యవసస్థను ఏరకంగా క్లీన్ చేస్తున్నామో గమనించండి. రైతులకు 175 ట్రాక్టర్ల మోడళ్లలో ఇష్టం వచ్చింది కొనుగోలు చేసే స్వేచ్ఛను ఇచ్చాం’’ అని సీఎం వైయస్ జగన్ తెలిపారు.
రాజమండ్రిలో ట్రాక్టర్లు పంపిణీ చేసిన హోం మంత్రి తానేటి వనిత
వైయస్ఆర్ యంత్రసేవా పథకాన్ని రాజమహేంద్రవరంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. వై. ఎస్.ఆర్.యంత్ర సేవా పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వనిత స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి,అనంతరం రైతులకు వాటిని పంపిణీ చేశారు .
వైయస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్ఆర్ యంత్రసేవా పథకాన్ని పార్వతీపురంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర మంగళవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు యంత్రాలను పంపిణీ చేశారు.
కర్నూలులో వైయస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్ఆర్ యంత్ర సేవ పథకంలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లా రైతులకు నగరంలోని ఎస్టిబిసి గ్రౌండ్లో ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పత్తికొండ నియోజకవర్గం లోని రైతు గ్రూపులకు మంజూరైన 19 ట్రాక్టర్లు లను, ఇంప్లిమెంట్ లను రైతు గ్రూప్ లకు అందజేశారు.