ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యాపారులకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మూడు రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చలు జరిగినట్లు అమలు సాధ్యాసాధ్యాలపై ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మరింత ఆదాయం రాబట్టుకోవటం కోసమే ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏపీలో మద్యనిషేధం అమలు చేసే క్రమంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంది. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడమేంటని అంతా విమర్శించినా పట్టించుకోలేదు. అంతేకాదు తీసుకున్న షాపుల్లో 20 శాతం మూసేసింది. మిగతా షాపుల్లోనూ నగదు రహితంగా చేయాల్సిన వ్యాపారాన్ని నగదుతోనే చేస్తోంది. మద్యం షాపుల్లో రెగ్యులర్ బ్రాండ్లు తీసేసి నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి అమ్ముతోంది. అయినా దీనిపై వచ్చే ఆదాయాన్ని అప్పులు తెచ్చుకునేందుకు హామీగా వాడుకుంటోంది. ఇంత చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరోసారి దీనిపై యూటర్న్ తీసుకునేందుకు సిద్ధమైపోయింది.
ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకున్న మద్యం షాపుల్ని తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే మంచిదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే తీసుకున్న మద్యం షాపుల్ని తిరిగి వేలం నిర్వహించి ప్రైవేటు వ్యక్తులకు, సంస్ధలకు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం మూడేళ్లుగా నిర్వహిస్తున్న మద్యం వ్యాపారం భారంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పెట్టిన రేట్లకు నాసిరకం మద్యాన్ని కొనేందుకు తాగుబోతులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో రెగ్యులర్ బ్రాండ్లు మళ్లీ తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో ఆదాయం కూడా పెరగడం లేదు. గతేడాది రూ.25 వేల మద్యం అమ్మితే.. ప్రభుత్వానికి రూ.20 వేల కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటుకు ఇచ్చేస్తే దీనికి రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు 19 వందల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అదే ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే నెలకు కనీసం 3 వేల కోట్ల విలువైన మద్యం అమ్మొచ్చనేది అబ్కారీ శాఖ అంచనా. మద్యం దుకాణాల్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తూ విధానాన్ని ప్రకటిస్తే.. దరఖాస్తు రుసుము, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఇప్పటికప్పుడు వెయ్యి కోట్ల రూపాయిలకు పైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా. గతంతో పోలిస్తే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగానే పెరిగినా.. విక్రయాల పరిమాణం మాత్రం తగ్గింది.. వాస్తవంగా రాష్ట్రంలో మద్యానికి డిమాండ్ బాగున్నా.. ఆ మేరకు అమ్మకాల పరిమాణం పెరగడం లేదు. అలాగని వినియోగమూ తగ్గడం లేదు. కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకుంటున్నారు. ఇంకొంత మంది నాటుసారాకు అలవాటు పడ్డారు.ఈ పరిస్థితుల్లో ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని భావిస్తున్న ఎక్సైజ్ శాఖ… ప్రైవేటు దుకాణాల్ని తెరపైకి తెస్తోంది. అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు అధికంగా ఉండటం, నాటుసారా తయారీ, వినియోగం విపరీతంగా పెరగడం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గోవా నుంచి సుంకం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి పెద్దఎత్తున అక్రమంగా రవాణా అవుతుండటం, ఓ మాదిరి, ఖరీదైన బ్రాండ్లు తాగేవారిలో ఎక్కువ మంది ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొనడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం లాంటి కారణాలతో.. ఏపీలో అమ్ముడవుతున్న మద్యం పరిమాణం తక్కువగా ఉంటోందనేది ఎక్సైజ్ శాఖ అభిప్రాయం. అందువల్ల ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే ఎక్కువ ఆదాయం రాబట్టుకోనే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది.