పశ్చిమ గోదావరి : బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు ఘనత దేశ ప్రజలందరికీ చాటుదామని కేంద్ర సాంస్కౄతిక, పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంత్యుత్సవాల నిర్వహణ, జూలై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో నిర్వహణ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. భీమవరంలోని అల్లూరి సీతారామ రాజు సంస్కౄతిక కళాకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి గురించి దేశమంతా తెలిసేలా ఆయన జయంత్యుత్సవాలు నిర్వహించాలనేది ప్రధాని మోదీ సంకల్పమని కిషన్రెడ్డి తెలిపారు. జయంతి వేడుకలు జూలై 4న మోదీ ప్రారంభిస్తారని, ఏడాది పాటు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లు అభివౄద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అల్లూరి జయంత్యుత్సవాలు నిర్వహిస్తామన్నారు.
దేశంలోనే మొట్టమొదటిగా మోగల్లులో 1965 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కిషన్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పాలకోడేరు మండలం కుముదవల్లిలోని పురాతన గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. పుస్తకాలను పరిశీలించి, గ్రంథాలయ అభివౄద్ధికి కేంద్రం సహకరించేలా తాను ప్రయత్నం చేస్తానన్నారు.
ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కాళ్ళ మండలం పెదఅమిరంలో జూలై 4న జరిగే సభలో పాల్టొంటారు. ఈ నేపథ్యంలో సభా వేదిక, హెలిప్యాడ్ స్థలాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.