- ట్విట్టర్‌లో మరో ఫొటో షేర్ చేసిన దర్శకురాలు లీనా మణిమేఖలై
‘కాళీ’ పోస్టర్‌పై ఎట్టకేలకు స్పందించిన దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం
లీనామణిమేఖలై..ఇప్పుడు ఫుల్ ట్రేండింగ్ లో ఉన్న పేరు. ‘కాళీ’ మాత సిగరెట్ కాల్చుతున్నట్టుగా పోస్టర్ విడుదల చేసి వివాదానికి తెరలేపిన దర్శకురాలు. ఈమె చేసిన పనికి హిందూ సంఘాలు భగ్గుమంటున్నా, పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదవుతున్నా లీనా మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్టుగా కనిపిస్తోంది. అదే స్పీడ్ లో ఆమె మరో ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ ను వదిలింది. శివపార్వతుల వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పొగ తాగుతున్నట్టుగా ఉన్న ఫొటోలను లీనా పోస్ట్ చేసింది. ఆ ఫొటోను పోస్ట్ చేసి Elsewhere… అని ట్వీట్ చేసింది.లీనా మణిమేఖలై పోస్ట్ చేసిన కాళీమాత పోస్టర్ ట్వీట్‌ను, అలాగే లీనా ట్విట్టర్ ఖాతాను భారత్ లో కనపడకుండా చేసింది. స్వలింగ సంపర్కుల జెండా నేపథ్యంలో కాళీమాత పాత్రలో లీనా ధూమపానం చేస్తున్నట్లుగా ఉన్నఈ పోస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన లీగల్ డిమాండ్ మేరకు ఆ పోస్టును భారత్‌లో కనపడకుండా చేసినట్లుగా ట్విటర్ పేర్కొంది. మరోవైపు కెనడాలోని హిందూ సంఘాల నాయకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ చిత్రానికి సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఉన్న అన్ని రకాల సమాచారాన్నీ తొలగించాల్సిందిగా భారత హైకమిషన్ కెనడా అధికారులను కోరింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేసినట్లు కెనాలోని ఆగాఖాన్ మ్యూజియం ప్రకటించింది. హిందువుల మనోభావాలను కించపరిచినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
స్పందించిన దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం
వివాదాస్పద ‘కాళీ’ పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ ఆలయం ఎట్టకేలకు స్పందించింది. మనందరం కాళీమాత భక్తులమేనని, చేతిలో సిగరెట్‌తో ఉన్న పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచిందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి మద్యం సమర్పిస్తుంటారని, మేకలను బలి ఇస్తుంటారని పేర్కొంది. అయితే, చేతిలో సిగరెట్ ఉండడం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పింది. అమ్మవారి పూజా విధానంలో బెంగాల్ వ్యాప్తంగా కొన్ని స్థిరమైన ఆచారాలు ఉన్నాయని, అందుకనే అమ్మవారికి కొందరు చేపలు నైవేద్యంగా సమర్పిస్తే మరికొందరు మాంసాన్ని భోగంగా ఇస్తారని కాళీ మాత ఆలయ అధికారులు, కార్యాలయ నిర్వాహకులు వివరించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ట్వీట్ చేశారు. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి వైన్ కూడా సమర్పిస్తారని, అది అక్కడి భక్తుల ఆచారమని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పోస్టర్ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దక్షిణేశ్వర్ కాళీ ఆలయం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
అసలు లీనా ఎవరు ? ఎక్కడివారు ?
తమిళనాడులోని మారుమూల గ్రామానికి చెందిన లీనా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మధురైకి దక్షిణాన ఉన్న మారుమూల గ్రామం మహారాజపురంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి లెక్చరర్. ఆమె గ్రామంలో ఆచార సాంప్రదాయాల పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా యుక్త వయసు రాగానే పెళ్లి చేసేస్తారు. అలా లీనాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా చెన్నై పారిపోయారు. ఆ తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ రంగాల్లో ఉద్యోగాలు కూడా చేశారు. అయితే ఆమెకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినిమా నిర్మాతగా మారారు. ఓ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్న సమయంలో అందులోని ఈ పోస్టర్లను లీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే హిందువులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఉండడంతో దేశ వ్యాప్తంగా వివాదం రాజుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆమెపై ఫిర్యాదులు ఇవ్వడంతో కేసులు కూడా నమోదయ్యాయి. మతపరమైన వివాదాలు సృష్టించే విధంగా ఈ పోస్టర్ ఉందని ఢిల్లీ ముంబయ్ యూపీల్లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. లీనా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఓ ట్వీట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. 2013లో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ‘నా జీవిత కాలంలో మోదీ ఈ దేశానికి ప్రధాని అయితే నా పాస్ పోర్ట్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ తో పాటు పౌరసత్వాన్ని సరౌండర్ చేస్తాను’ అని పేర్కొంది. అయితే ఆ సమయంలో వివాదం రేగడంతో ఆమె ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. ఇప్పుడు తాజాగా ఆమె ఇలాంటి పోస్టర్లలో వివాదాస్పదంగా ఉన్న ‘కాళి’ ట్వీట్ ను తొలగించింది.
‘కాళీ పోస్టర్’ ట్వీట్ ను తొలగించిన ట్విట్టర్
డైరెక్టర్ లీనా మణిమేకలై ‘కాళీ’ సినిమా పోస్టర్ ను ట్విట్టర్ తొలగించింది. హిందూ దేవత పొగతాగుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ తీవ్రదుమారం రేపిన విషయం తెలిసిందే. తన ట్వీట్ తొలగింపుపై మణిమేకలై కూడా స్పందించారు. ‘2 లక్షల మంది ద్వేషపూరిత ప్రేరేపకుల ట్వీట్ లను ట్విట్టర్ ఇండియా తొలగిస్తుందా? ’ అని ఆమె ప్రశ్నించింది. కొందరు హిందూ దేవతల గెటప్ వేసుకొని పొగతాగుతున్న ఫొటోలను ఆమె పోస్టు చేసింది.