దివంగత ప్రధాని P.V.నరసింహారావు జయంతిని పురస్కరించుకుని రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖులు ఘననివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని పీవీఘాట్‌కు తరలివచ్చిన నేతలు… ఆయన సేవలను స్మరించుకున్నారు. పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. దేశం, మాతృభాష అభివృద్ధికి పీవీ విశేష కృషి చేశారని తెలిపారు. స్వర్గీయ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ ను సందర్శించిన బండి సంజయ్ ఈ సందర్భంగా పీవీకి ఘన నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు ఛరిష్మాను వాడుకుని లబ్ది పొందిన కేసీఆర్… ఎన్నికలయ్యాక ఆయనను పూర్తిగా విస్మరించారని అన్నారు. పీవీ జయంతి ఉత్సవాలకు కూడా హాజరుకాకపోవడం సిగ్గు చేటన్నారు. .
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు బహుభాషాకోవిదుడు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు పాలించిన రాజనీతిజ్ఝుడు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తి తెలంగాణ లో జన్మించడం… అందులోనూ మా కరీంనగర్ జిల్లాకు చెందిన బిడ్డ కావడం అద్రుష్టంగా భావిస్తున్నా. మంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధానిగా ఉన్నత పదవుల్లో కొనసాగి ఎన్నో సేవలందించిన మహనీయుడు పీవీ.
సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నర్సింహారావు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి. పేదల గురించి నిత్యం ఆలోచించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని స్పూర్తిగా తీసుకుంటాం. పీవీ, తెలుగు ఠీవీ అని వల్లించే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పీవీ జయంతికి కూడా ఇక్కడికి రాలేదు. ఆయనకున్న అంత బిజీ ఏమిటి? బహుశా…. ఎలక్షన్లు లేవుగా… తెలారిలేస్తే ఆయనకు కావాల్సింది రాజకీయాలే… ఎవడి కొంప ముంచాలన్నదే లక్ష్యంగా పనిచేస్తడు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు పీవీ తెలుగు ఠీవీ అన్నడు….. ఎన్నికలయ్యాక మర్చిపోయిండు.. పీవీ ఘాట్ కు రూ. వంద కోట్లు ఖర్చు పెడతానన్నవ్? శత జయంతి ఉత్సవాలు ఎన్నిదేశాల్లో జరిపినవ్. కేసీఆర్, ఆయన కొడుకు ఫోటోలతో ఫ్లెక్సీలు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు.
పీవీ జన్మస్థలం వంగరను అభివృద్ధి చేస్తా
స్మారక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. సీఎం పీవీ జయంతికి రాకపోవడానికి కారణమేంది? అవసరమైతే కాళ్లు… లేదంటే జుట్టు పట్టుకునే వ్యక్తి కేసీఆర్… ప్రజలంతా కేసీఆర్ తీరును చూసి థూ.. ఛీ అని చీదరిస్తున్నరు. కనీస ఇంగిత జ్ఝానం లేని మూర్ఖుడు. పీవీ అభిమానాలు, కుటుంబ సభ్యులు గుర్తించాలి. పీవీని అవమానించిన మూర్ఖుడు. రాజకీయాల కోసం వాడుకుని వదిలేసే నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలి. గాంధేయతర కుటుంబ వ్యక్తి దేశ ప్రధాని కావడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. రాజకీయ చతురతతో దేశాన్ని పాలించినా ఓర్వలేక, సహించలేకపోయింది. పీవీ శవాన్ని కూడా కాలకుండా చేశారు. పీవీ జయంతి ఉత్సవాలకు కూడా హాజరు కావడం లేదు. ప్రధానుల జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో పీవీ చరిత్రను కూడా దేశానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన పీవీని మోదీ సర్కార్…. ప్రత్యేకంగా గౌరవిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఆయన…. దివంగత నేత సేవలను గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి పీవీ నర్సింహారావు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని తరఫున ఘన నివాళులర్పించారు. దిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తామని తెలిపారు. పీఎం మ్యూజియంలో పీవీ జ్ఞాపకాలు ఏర్పాటు చేశామన్న కిషన్ రెడ్డి.. పీవీ చరిత్ర తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. పీవీ గొప్పతనాన్ని తెలిపేలా తపాలా బిళ్ల విడుదల చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.ప్రపంచం ముందు భారత్‌ను గొప్పగా నిలబెట్టిన తెలుగుబిడ్డకు దిల్లీలో సరైన గౌరవం దక్కటంలేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. పీవీ గొప్ప నాయకుడని.. ఆయన తెచ్చిన సంస్కరణల వల్లే దేశం నిలబడిందని తెలిపారు. భారత్ను ప్రపంచ దేశాల ముందు గొప్పగా నిలబెట్టారని అన్నారు. పీవీకి కాంగ్రెస్‌లో తగిన గౌరవం దక్కలేదని తలసాని వాపోయారు. సీఎం కేసీఆర్ పీవీ కుమార్తెకు సముచిత స్థానం, గౌరవం కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు పీవీ ఘాట్ను సందర్శించాలని కోరారు. పీవీ ఘాట్లో పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. పీవీ జీవించి ఉంటే… నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలు చూసి బాధపడేవారని పేర్కొన్నారు.ఏ నాయకుడి జయంతి, వర్దంతులనైనా మానవతాస్పూర్తితో నిర్వహించాలి. కానీ మానవత్వం లేని మూర్ఖుడు కేసీఆర్.
వివేక్ వెంకటస్వామి నివాళి
చరిత్ర ఉన్నంత వరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పీవీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పీవీతో మా తండ్రిగారికి మంచి అనుబంధం ఉందన్నారు. చాలా సంవత్సరాలు ఇద్దరు కలిసి క్యాబినెట్ లో పని చేశారని తెలిపారు. రెవల్యూషన్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ సమయంలో మా నాన్న గారు పీవీకి తోడు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం దేశం 3 మిలియన్ లతో ముందుకు వెళుతుందంటే దానికి కేవలం పీవీ నరసింహారావుగారే కారణమన్నారు. దేశంలో పీవీ నర్సింహారావు ఎకనామిక్ రిఫామ్స్ తీసుకొచ్చారని కొనియాడారు. పీవీకి బీజేపీ ప్రభుత్వం సమున్నత స్థానం ఇస్తుందని చెప్పారు. ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. చరిత్ర ఉన్నంత వరకు పీవీని గుర్తుంచుకోవాలన్నారు వివేక్ వెంకటస్వామి.
చంద్రబాబు నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నివాళి అర్పించారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసినా.. ప్రధానిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినా.. మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు’’ అని కొనియాడారు. తెలుగు వెలుగు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి దేశసేవను స్మరించుకుంటూ ఆయన స్మృతికి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.
ఆదర్శ పాలనాదక్షులు : పవన్ కళ్యాణ్
ఆదర్శ పాలనాదక్షులు పీవీ నరసింహారావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఓ ప్రకటనను పవన్ విడుదల చేశారు. ఆ ప్రకటనలో పవన్.. ‘‘కులాలను విడదీయలేదు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టలేదు. ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోయలేయలేదు. గద్దెనెక్కాక లక్షల కోట్లు సంపాదించనూ లేదు. ఇదీ కదా ఆదర్శనాయకుడంటే. అందుకే ఆయనంటే నాకు అమితమైన గౌరవం. మాటల్లో చెప్పలేనంత అభిమానం. పీవీ నరసింహారావు జయంతి సందర్భాన ఆయనకు వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను. ఆయన మన తెలుగువానిగా తెలంగాణ గడ్డపై జన్మించడం తెలుగు ప్రజలు చేసుకున్న సుకృతం. ఆ పుంభావ సరస్వతికి, పరిపాలనా దిగ్గజానికి నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన ఘనంగా జేజేలు పలుకుతున్నాను’’ అని పేర్కొన్నారు.