శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని బుధవారం ఈవో ప్రారంభించి, కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈవో మాట్లాడుతూ, టీటీడీ నిర్వహించే సామూహిక వివాహమహోత్సవంలో ఒకటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు, వధువు నుండి 20 మంది, వరుడి నుండి 20 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్వామి వారి ఆశీస్సులతో ఉచితంగా జరిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం కల్యాణమస్తు దరఖాస్తు పత్రాలను అన్ని జిల్లా కేంద్రాలకు పంపుతున్నట్లు చెప్పారు. టీటీడీ నుండి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కో అర్డినేటర్‌ను నియమించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలతో సమన్వయం చేసుకుని కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
జూన్ 23న వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు ముఖ్యమంత్రి హాజరు
తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద ( పేరూరు బండపై) నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో జూన్ 23వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీ వకుళ మాత ఆలయం వద్ద ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ సహాకారంతో శ్రీ వకుళ మాత ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల కాలంలో ఆలయాన్ని రాతి కట్టడం, అద్బుత శిల్ప కళతో నిర్మించినట్లు చెప్పారు. వకుళ మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం నుండి శ్రీ వకుళమాత అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు వివరించారు. టీటీడీ వైఖానస ఆగమ సలహా దారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ, స్కంధ, వరాహ, భవిష్యోత్తర పురాణాల ప్రకారం శ్రీ వకుళ మాత తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మాతృమూర్తి అని చెప్పారు. ప్రాచీనమైన శ్రీ వకుళ మాత ఆలయం పేరూరు బండపై ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇంత గొప్ప ఆలయం కాల క్రమంలో శిధిలావస్థకు చేరుకుందని, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా, ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించినట్లు తెలిపారు. మంత్రి దాదాపు 20 కేజిల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు, విమానానికి ఒక కలశం టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జూన్ 19 నుండి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.