ఆగస్టు 7 న రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు జరగనున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వారు జులై 1వ తేదీ నుంచి వివరాలు నమోదు చేసుకోవాలని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమ ముహూర్త పత్రికను ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. తర్వాత తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ కల్యాణమస్తు కార్యక్రమానికి ఆగస్టు 7న ఉదయం 8.07 నిమిషాల నుండి 8 . 17 నిమిషాల మధ్య పండితులు సుముహూర్తం నిర్ణయించినట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లో సూచించిన ప్రాంతాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందుకోసం పెళ్లిదుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందించి పెళ్లి భోజనం వడ్డించడం జరుగుతుందన్నారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమానికి నమోదు చేసుకుని శ్రీవారి ఆశీస్సులతో వివాహాలు చేసుకోవాలని కోరారు. పదేళ్ల తరువాత కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించామని, మొదట ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించి ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో చేపడతామన్నారు. అనంతరం ముహూర్త పత్రికను సిద్ధం చేసిన టీటీడీ ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులను శ్రీవారి ఆలయంలో శాలువతో సన్మానించారు.
జూన్ 30 లోపు లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలి
తిరుమలలోని దుకాణదారులు, హాకర్లు, బాలాజినగర్‌లోని అద్దెదారులు జూన్ 30లోపు లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా వారసులు/కొనుగోలుచేసిన వారు (పర్చేజర్లు) లైసెన్సులు బదిలీ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు టీటీడీ రెవెన్యూ విభాగం సూచించిన పత్రాలను జతపరిచి సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 30 తరువాత వచ్చే విజ్ఞప్తులు స్వీకరించడం జరగదు అన్నారు. గడువులోపు లైసెన్సులు రెన్యువల్ గానీ, బదిలీ గానీ చేసుకోని పక్షంలో అలాంటి దుకాణాలను ఆక్రమణలుగా భావించి లైసెన్సులు రద్దు చేసి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఒరిజినల్ లైసెన్సుదారులు, లైసెన్సుదారుల వారసులు, ఒరిజినల్ లైసెన్సులు గల దుకాణాలు కొనుగోలు చేసినవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరడమైనది.
నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వైభవం
అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు స్వామి వారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా జరిగిన వాహనసేవలో భక్తులు పాల్గొన్నారు.