ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని రోజు రోజుకీ దిగజారిపోతోంది అని ఆర్థికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి వచ్చిన డోకా ఏమీ లేదు అంటుంది. కానీ ప్రభుత్వం కాగ్ కు లెక్కలు చెప్పడం లేదు,అదే సమయంలో సుప్రీం కోర్టులో ప్రభుత్వం కాగ్ కి లెక్క చెప్పినట్లు వేసిన అఫిడవిట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ కు దారి తీస్తుంది. ప్రభుత్వం చెపుతున్న లెక్కలకు, కాగ్ లెక్కలకు అస్సలు పొంతన కుదరడం లేదు.
కార్పొరేషన్లు చేసేవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులేనని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ స్పష్టంగా తెలిపింది. బడ్జెట్‌లో చూపకుండా కార్పొరేషన్ల నుంచి ఎంత రుణం తీసుకున్నారో తెలియజేయాలని కాగ్ అనేకమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఆ లెక్కలు ఇవ్వట్లేదు.2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక లెక్కలపై ఇప్పటికీ అనుమానాలు తేలలేదు.కానీ రాష్ట్ర ఆర్థికపరిస్థితి భేషుగ్గా ఉందని, ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను అద్బుతంగా నిర్వహిస్తోందని సుప్రీంకోర్టు లో జగన్ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్ తీవ్ర చర్చకు దారితీస్తుంది.2021-22 ఆర్థిక సంవత్సరం తుది లెక్కలను కాగ్ ఇంకా నిర్దారించలేదు.కానీ ఆ లెక్కల ప్రాతిపదికగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
2021-22లో కాగ్ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహిస్తూ రెవెన్యూ లోటున 8,370.51 కోట్ల రూపాయలకు, ఆర్థికలోటును 25,194.62 కోట్లకు పరిమితం చేశామని,దానివల్ల రుణ-జీఎస్‌డీపీ 2.10శాతానికి తగ్గిపోయిందని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రుణభారం ఎక్కువ అవుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి అఫిడవిట్ చర్చలకు తావిచ్చింది.బడ్జెట్ ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా చేసినవీ ప్రభుత్వ అప్పులేనని కేంద్ర ఆర్థికశాఖ చెప్పింది. అవేవీ అధికారిక లెక్కల్లోకి రావట్లేదు.రుణ పరిమితిని కేంద్రం జీఎస్‌డీపీలో 3.5శాతానికి పరిమితం చేస్తోంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా రుణాలు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు తాజాగా వివాదాస్పదమయ్యాయి.
ప్రభుత్వం వ్యాట్ వంటి వాటిని తగ్గించుకుని బెవరేజస్ కార్పొరేషన్ వంటి వాటికి ప్రత్యేక పన్నులు వసూలు చేసుకునే అధికారం కల్పించి అప్పులు తెస్తోంది. రాబోయే కాలం ఆదాయాలను ఎస్క్రో చేసి రుణాలు చేస్తున్నారు. ఆ అప్పులను, అక్కడ చేసే ఖర్చులను లెక్కల్లో చూపడం లేదు,కాగ్‌కూ ఇవ్వట్లేదు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ చెబుతున్న లెక్కలన్నీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. 18 వేల కోట్ల వ్యయం తగ్గించి చూపడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ తీవ్రంగా ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ సమాధానమేంటో ఇప్పటికీ వెల్లడి కాలేదు. ఈ లెక్కల ఆధారంగా సమర్పించే అఫిడవిట్లు అందుకే చర్చనీయాంశమవుతున్నాయి.
ఈ లెక్కల మాయాజాలం మీద రిటైర్డ్ అధికారులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆర్థికశాఖ విశ్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ AP లో ఏపీఎస్‌ఐడీసీ, బెవరేజస్ కార్పొరేషన్ వంటి వాటిద్వారా రుణాలు తీసుకుని, ఖర్చు చేస్తున్నారని, అవి అకౌంటెంట్ జనరల్ పరిధిలోకి రావడం లేదని అలాంటిచోట అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని అని అన్నారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుందంటే ఆదాయం పెరగాలని కానీ ఎక్కడా పెరిగినట్లు కనిపించడం లేదని అన్నారు. అన్ని చోట్ల నుంచి అప్పులు తెచ్చి పరిస్థితి ఎలా బాగుచేస్తారో, ఆ ఎకనామిక్స్ ఏమిటో ముఖ్యమంత్రే కే అర్దం కావాలి గాని మనకు అర్దం కాదు అని అన్నారు.