రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలకు జీవన మరణం అని అందరికీ తెలిసిందే. తమ పార్టీలు మనగలగాలి అన్న ప్రత్యర్ధి పార్టీల మీద పై చేయి గా ఉండాలన్న తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. అధికారం చేపట్టిన దగ్గర నుండి దూకుడుగా ప్రతిపక్ష పార్టీల మీద ప్రతాపం చూపిన వైసీపీకి ఈసారి అధికారం కచ్చితంగా నిలబెట్టుకోవాలి. అలాగే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తమ కేడర్ ని నిలబెట్టుకోవాలి, వైసీపీ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి అంటే అధికారం రాబట్టుకోవాలి. రెండు పార్టీలు తమ తమ వ్యూహాలు పదును పెట్టాయి.
రాబోయే ఎన్నికల్లో సూపర్ విక్టరీ కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే టీడీపీ బలంగా ఉన్న చోట్ల ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని లాగేసుకోవటం. తనహయాంలో చంద్రబాబునాయుడు వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకున్నారు. అయితే జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇక్కడే కనబడుతోంది. వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకుని జనాల్లో చంద్రబాబు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.జగన్ ఆపనిచేయటంలేదు, ఎంఎల్ఏలను వదిలేసి కేవలం ద్వితీయశ్రేణి నేతలపైన మాత్రమే గురిపెట్టారు. ఏపార్టీ తరపున అభ్యర్ధి గెలవాలన్నా సదరుపార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు చాలా కీలకమన్న విషయం తెలిసిందే.ఒకఅభ్యర్ధి ఎంఎల్ఏగా గెలవాలంటే కనీసం పదిమంది గట్టినేతలు మద్దతు చాలా అవసరం.
ప్రస్తుతం జగన్ చేస్తున్నది టీడీపీలోని అలాంటి పదిమంది గట్టినేతలపైన దృష్టిపెట్టడమే. వీరిలో ఎంతమందిని వీలుంటే అంతమందిని వైసీపీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సూపర్ విక్టరీ సాధ్యమే అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని టీడీపీ ద్వితీయశ్రేణి నేతలపై ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారట. మంగళగిరిలో గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకోవటం తన వ్యూహంలో భాగమే అని వైసీపీ వర్గాలంటున్నాయి. చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలతో చర్చలు జరుగుతున్నాయట. ఆ చర్చలు ఒక కొలిక్కివస్తే నేరుగా జగనే సదరు నేతలతో మాట్లాడుతున్నారు.